Even Nature Is Mocking Flooded Pakistan : భారత్-పాకిస్తాన్ సరిహద్దులోని ప్రసిద్ధ వాఘా-అటారీ బార్డర్‌లో జరిగిన ఒక సంఘటన సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. పాకిస్తాన్ వైపు భారీ వర్షాల కారణంగా పరేడ్ మైదానం జలమయమై, పాకిస్తాన్ రేంజర్స్ కాళ్ల వరకు నీటిలో నిలబడి రోజువారీ బీటింగ్ రిట్రీట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. భారత వైపు అటారీ బా ర్డర్ పొడిగా, చక్కగా ఉంది. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. పాకిస్తాన్ పై జోకులు వేయడానికి కారణం అయింది.
ఈ వైరల్ వీడియోలో, పాకిస్తాన్ వైపు పరేడ్ మైదానంలో నీరు నిలిచి, చెత్త కుప్పలు , ఇసుక సంచులు చుట్టూ కనిపిస్తున్నాయి. పాకిస్తాన్ రేంజర్స్ నీటిలో నడుస్తూ జెండా దించే కార్యక్రమాన్ని కొనసాగించారు. దీనికి విరుద్ధంగా, భారత వైపు బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ నిర్వహణలో ఉన్న ప్రాంతం శుభ్రంగా, పొడిగా ఉంది.
ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా షేర్ కావడంతో, నెటిజన్లు పాకిస్తాన్ సైన్య ఛీఫ్ జనరల్ ఆసిమ్ మునీర్ గతంలో చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను గుర్తు చేస్తూ పరువు తీశారు. మునీర్, ఇటీవల ఫ్లోరిడాలో జరిగిన ఒక డిన్నర్‌లో, భారత్‌ను “వెలిగే మెర్సిడెస్”గా, పాకిస్తాన్‌ను “గ్రావెల్‌తో నిండిన డంప్ ట్రక్”గా పోల్చారు. దాన్నే గుర్తు చేస్తూ.. ప్రకృతి కూడా పాకిస్తాన్‌ను ఎగతాళి చేస్తోందని సెటైర్లు వేశారు.
ఇక్కడ విశేషం ఏమిటంటే తమ వైపు నీళ్లు నిలబడిపోవడానికి భారతే కారణమని పాకిస్తాన్ అంటోంది. తమ వైపు నీటి నిల్వకు భారత్ వైపు గ్రాండ్ ట్రంక్ రోడ్డు ఎత్తు కారణమని ఆరోపించింది. ఈ విషయాన్ని ఇస్లామాబాద్ గతంలో భారత అధికారులతో లేవనెత్తినట్లు తెలిసింది. అయితే, భారత్ ఈ ఆరోపణలను తోసిపుచ్చింది, తమ వైపు వర్షపు నీటి సేకరణ వ్యవస్థ , మెరుగైన డ్రైనేజీ నిర్వహణ వల్ల నీరు నిలబడలేదని.. పాకిస్తాన్ ఆ ఏర్పాట్లు చేసుకోలేదని తెలిపింది.