కరోనా వైరస్ ఫస్ట్ వేవ్ సమయం నుంచి విమాన ప్రయాణాలపై ఆంక్షలు అధికమయ్యాయి. ముఖ్యంగా భారత్ లాంటి దేశాలపై కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో పలు దేశాలు ఆంక్షలు విధించాయి. తాజాగా ఇతిహాద్ ఎయిర్‌వేస్ భారత్‌పై ఆంక్షలు విధించింది. భారత్ నుంచి యునైటెడ్ అరబ్ ఎమిరెట్స్ (యూఏఈ)కి ఇతిహాద్ విమానాలను నిలిపివేశారు. ఈ మేరకు ఇతిహాద్ అధికార ప్రతినిధి ఈ విషయాన్ని వెల్లడించారు.


భారత్‌లో కరోనా సెకండ్ వేవ్ వ్యాప్తి కొనసాగుతున్న నేపథ్యంలో ప్రయాణ ఆంక్షలు ఇంకా కొనసాగుతున్నాయి. ఇదివరకే న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, యూఏఈ, కెనడా లాంటి పలు దేశాలు ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ సమయంలో భారత్ నుంచి విమానాల రాకపోకలను నిషేధించాయి. కొన్ని రోజుల అనంతరం విమాన ప్రయాణాలకు అనుమతి ఇచ్చాయి. తాజాగా యూఏఈ ప్రభుత్వం సరికొత్త మార్గదర్శకాలను అనుసరించి భారత్ నుంచి విమానాలను నిలిపివేస్తూ ఇతిహాద్ ఎయిర్‌వేస్ నిర్ణయం తీసుకుంది. తదుపరి ప్రకటన వెలువడే వరకు ఈ నిషేధ ఆంక్షలు అమలులో ఉంటాయని ఆ సంస్థ ప్రతినిధి తెలిపారు. 


కేవలం యూఏఈ పౌరులు, దౌత్య సంబంధ పనుల నిమిత్తం భారత్ వెళ్లిన వారు, అధికారులును, గోల్డెన్ రెసిడెన్స్ హోల్డర్స్‌కు ప్రయాణ ఆంక్షల నుంచి యూఏఈ ప్రభుత్వం మినహాయింపు కల్పించింది. మినహాయింపు కల్పించిన వారికి సైతం క్వారంటైన్ నియమాలు తప్పనిసరి వర్తిస్తాయని ఇతిహాద్ ఎయిర్‌వేస్ ప్రతినిధి వెల్లడించారు. 


యూఏఈ నుంచి భారత్‌కు మాత్రం తమ విమాన సర్వీసులు కొనసాగుతాయని, ఇందులో ఏ మార్పు లేదని చెప్పారు. కార్గో విమాన సర్వీసులను భారత్, యూఏఈల మధ్య రెండు వైపులా ఎలాంటి ఆంక్షలు లేకుండా కొనసాగిస్తున్నారు. ఇతిహాద్ డాట్ కామ్ వెబ్‌సైట్‌లో డెస్టినేషన్ గైడ్‌లో అన్ని వివరాలు అందుబాటులో ఉంచారరు. ప్రయాణికులకు ఏవైనా సందేహాలుంటే +971 600 555 666 యూఏఈ నెంబర్‌లో సంప్రదించాలని సూచించారు.  ట్రావెల్ ఏజెంట్ ద్వారా టికెట్లు బుక్ చేసుకున్న ప్రయాణికులు సంబంధిత ఏజెన్సీని సంప్రదించి వారి టికెట్ నగదును అడగాలన్నారు. భారత్ నుంచి ప్రయాణాలకు సర్వీసులను తాత్కాలికంగా రద్దు చేసినదుకు చింతిస్తున్నామని ఓ ప్రకటనలో పేర్కొంది.


కాగా, దేశంలో నిన్న ఒక్కరోజు 17,28,795 మందికి కొవిడ్19 నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా, 43,509 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారించారు. దేశంలో మొత్తం కరోనా కేసులు 3.15కోట్ల మార్కును చేరుకున్నాయి. కరోనాతో పోరాడుతూ మరో 640మంది మరణించగా, మొత్తం కరోనా మరణాల సంఖ్య 4.22లక్షలకు చేరింది. కేరళలో ఏకంగా 22 వేలకు పైగా తాజా కరోనా కేసులు రావడం ఆందోళన కలిగిస్తోంది. ఆరుగురు సభ్యుల టీమ్‌ను కేంద్ర ప్రభుత్వం కేరళకు పంపుతుంది. కేరళ తరువాత మహారాష్ట్రలో కరోనా కేసులు నమోదవుతున్నాయి.