Epstein Files Hardeep Puri Refutes Rahul Gandhi Charge: అమెరికాకు చెందిన వ్యాపారవేత్త జెఫ్రీ ఎప్ స్టీన్‌కు సంబంధించిన రహస్య పత్రాల  వివాదం భారత రాజకీయాలనూ కలకలం రేపుతోంది. ఈ అంశాన్ని రాహుల్ గాంధీ తెరపైకి తెచ్చారు. ప్రధాని నరేంద్ర మోదీకి ఎప్ స్టీన్‌తో సంబంధాలు ఉన్నాయని, ఆ పత్రాలలో మోదీ పేరు ఉందంటూ రాహుల్ గాంధీ తీవ్ర ఆరోపణలు చేశారు. దీనిపై ప్రధాని వివరణ ఇవ్వాలని డిమాండ్ చేయడంతో పాటు, కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరికి కూడా ఎప్ స్టీన్‌తో పరిచయాలు ఉన్నాయని రాహుల్ వ్యాఖ్యానించారు.    రాహుల్ గాంధీ ఆరోపణలపై కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి తీవ్రంగా స్పందించారు. తనపై చేసిన ఆరోపణలను ఆయన పూర్తిగా తోసిపుచ్చారు. 2010లో తాను ఐక్యరాజ్యసమితిలో భారత రాయబారిగా పనిచేస్తున్నప్పుడు ఒక సామాజిక కార్యక్రమంలో ఎప్ స్టీన్‌ను కలిశానని తెలిపారు.  ఆ పరిచయం కేవలం వృత్తిపరమైనది, యాదృచ్ఛికమైనది మాత్రమేనని స్పష్టం చేశారు.  బయటపడిన లక్షల ఫైల్స్ లో తన ప్రస్తావన కేవలం నాలుగు లైన్లలో మాత్రమే ఉందన్నారు.  రాహుల్ గాంధీ ఒక అబద్ధాల కోరు అని, తన కుటుంబ సభ్యులు ,కాంగ్రెస్ నాయకులకు అంతర్జాతీయంగా ఉన్న అనుమానాస్పద సంబంధాలను దాచుకోవడానికి ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని పూరి విమర్శించారు.   

Continues below advertisement

 కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు ఈ వివాదంలో జోక్యం చేసుకుంటూ రాహుల్ గాంధీకి  గడువు విధించారు. రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలకు తగిన ఆధారాలను 24 గంటలలోపు దేశం ముందు ఉంచాలని, లేనిపక్షంలో బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. బాధ్యతాయుతమైన విపక్ష నేత హోదాలో ఉండి, ఎలాంటి ఆధారాలు లేకుండా ప్రధాని వ్యక్తిత్వాన్ని కించపరిచేలా మాట్లాడటం సరికాదని రిజిజు హెచ్చరించారు. అబద్ధపు ప్రచారాలు చేయడం రాహుల్‌కు అలవాటుగా మారిందని ఆయన మండిపడ్డారు. 

Continues below advertisement

ఈ వివాదం పార్లమెంటు మరియు వెలుపల కూడా వేడిని పెంచింది.  బీజేపీ  నేతలు రాహుల్ గాంధీపై  సభా హక్కుల ఉల్లంఘన నోటీసు  ఇచ్చే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు కాంగ్రెస్ వర్గాలు మాత్రం ఎప్ స్టీన్ ఫైల్స్‌లో ఉన్న సమాచారం బహిర్గతం కావాలని, దీనిపై స్వతంత్ర దర్యాప్తు జరగాలని పట్టుబడుతున్నాయి. అంతర్జాతీయ స్థాయికి చెందిన ఈ వివాదం భారత రాజకీయాలలో వ్యక్తిగత దూషణలకు దారితీయడం చర్చనీయాంశంగా మారింది.