X Vs Central Govt: ఎలన్ మస్క్ X వర్సెస్ కేంద్ర ప్రభుత్వం గొడవ కొనసాగుతూనే ఉంది. తమ నిబంధనలకు అనుగుణంగా నడుచుకోవడం లేదని చాలా సార్లు కేంద్రం అసహనం వ్యక్తం చేసింది. ఇప్పుడు మరోసారి  Xకి నోటీసులు పంపింది. దీనిపై X కి సంబంధించిన Global Government Affairs మండి పడింది. కొన్ని అకౌంట్స్‌పై ఆంక్షలు విధించింది. వాటిని కేంద్రం హోల్డ్‌లో పెట్టింది. భావ ప్రకటనా స్వేచ్ఛకి ఇది భంగం కలిగిస్తోందని వాదిస్తోంది. అర్ధరాత్రి 1.04 కి ఈ నోటీసులు వచ్చినట్టు వివరించింది. పైగా ఈ నోటీసులో పారదర్శకత కనిపించడం లేదని స్పష్టం చేసింది. కొన్ని న్యాయపరమైన అడ్డంకుల కారణంగా అందులో ఏముందో పూర్తి వివరాలు చెప్పలేకపోతున్నామని వెల్లడించింది. ఏదేమైనా ఈ ఆదేశాలను తు.చ తప్పకుండా పాటిస్తామని వివరించింది. 


"కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకే నడుచుకుంటాం. భారత్‌లో మాత్రం ఆ అకౌంట్స్‌ని హోల్డ్‌లో పెట్టేస్తాం. కానీ...కేంద్రం నోటీసుల మాత్రం ఖండిస్తున్నాం. అన్ని పోస్ట్‌లకీ భావ ప్రకటనా స్వేచ్ఛను పాటించేలా చూసుకుంటాం. ఇది మా విధానం"


- X యాజమాన్యం




అటు కేంద్రం మాత్రం కచ్చితంగా ఆ అకౌంట్‌లపై నిఘా ఉండాల్సిందేనని తేల్చి చెబుతోంది. పోస్ట్‌లనూ ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ఉండాలని స్పష్టం చేసింది. నిబంధనలు పాటించకపోతే భారీ జరిమానాలు తప్పవని వెల్లడించింది. కొన్ని సార్లు జైలు శిక్ష కూడా తప్పదని అంటోంది.