హైదరాబాదులో గణేష్ నిమజ్జనానికి విస్తృత ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. మంగళవారం సికింద్రాబాద్లోని పలు ప్రాంతాల్లో వివిధ శాఖల అధికారులతో కలిసి నిమర్జనం కోసం జరుగుతున్న ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. ప్రశాంత వాతావరణంలో గణేష్ శోభాయాత్ర, నిమజ్జనం జరిగే విధంగా ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి తలసాని చెప్పారు.


ముందుగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సర్కిల్, ప్యాట్నీ సర్కిల్, ప్యారడైజ్ సర్కిల్, బోట్స్ క్లబ్ సర్కిల్ తదితర ప్రాంతాల్లో పర్యటించి అధికారులకు ఏర్పాట్లపై తగు సూచనలు చేశారు. శోభాయాత్ర నిర్వహించే మార్గాలలో లైటింగ్ ఏర్పాటు చేయాలని, అవసరమైన ప్రాంతాల్లో రహదారుల మరమ్మతులు చేపట్టాలని ఆదేశించారు. అదేవిధంగా విగ్రహాలతో వచ్చే వాహనాలకు ఆటంకం కలగకుండా చెట్ల కొమ్మలు, విద్యుత్ తీగలు అడ్డం లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. భక్తుల కోసం వాటర్ వర్క్స్ ఆధ్వర్యంలో ప్రత్యేక తాగునీటి కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.


నిమజ్జనం పాయింట్ల వద్ద రక్షణ కంచెలు, లైటింగ్స్, పెద్ద క్రేన్లు, చిన్న క్రేన్లు ఏర్పాటు చేయాలని సూచించారు. ఇక్కడ కూడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అందుబాటులో ఉంచాలని, నిమజ్జనం ప్రాంతాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని తెలిపారు.  విద్యుత్ అంతరాయం ఏర్పడితే ఇబ్బందులు తలెత్తకుండా జనరేటర్లను ఏర్పాటు చేయాలన్నారు. ప్రతి పాయింట్ వద్ద పోలీస్, మున్సిపల్ సిబ్బంది, గజ ఈతగాళ్లతోపాటు వాలంటీర్లను కూడా ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. నిమజ్జన కార్యక్రమం నిర్వహించే ప్రాంతంలో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా తగిన చర్యలు తీసుకోవాలని అన్నారు. నిమర్జనం సజావుగా జరగడంతో పాటు నిమర్జనం తర్వాత విగ్రహాలతో సమస్య తలెత్తకుండా తగిన చర్యలు తీసుకునేలా ప్రతి నిమర్జనం పాయింట్ వద్ద ఒక అధికారిని ఏర్పాటు చేస్తామని చెప్పారు. 


3,600 సీసీ కెమెరాలు వినియోగిస్తున్నాం



గణేష్ నిమజ్జనం కోసం దాదాపు 3600 సీసీ కెమెరాలు వినియోగిస్తున్నట్లు మంత్రి తలసాని వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... " వినాయక చవితి హైదరాబాదులో పెద్ద పండుగ. నగరవ్యాప్తంగా గత ఏడాది కంటే ఈ ఏడాది రికార్డు స్థాయిలో గణేష్ విగ్రహాలు ఏర్పాటు చేశారు. వినాయక చవితి ఉత్సవాల కోసం నెల రోజుల ముందు నుంచే అన్ని శాఖల అధికారులను, సిబ్బందిని సన్నద్ధం చేసాం. ఇతర శాఖలతో సమన్వయం చేసుకొని రోడ్డు పనులు, కరెంట్ పనులు అన్నీ పూర్తి చేశాం. వినాయక విగ్రహాలు ప్రతిష్టించడానికి ముందు ఈసారి నిర్వహకుల దగ్గర నుంచి వివరాలు సేకరించాం. నగరంలో ఎన్ని విగ్రహాలు ఏర్పాటు చేశారన్న దానిపై క్లారిటీ ఉంది. దీంతో నిమజ్జన ఏర్పాట్లు, రూట్ మ్యాప్ సిద్ధం చేయడం సులభంగా ఉంటుంది" అని మంత్రి శ్రీనివాస్ యాదవ్ చెప్పారు.


నిమజ్జనం కోసం వచ్చే విగ్రహాలకు స్వాగతం పలికే విధంగా స్టేజీలను ఏర్పాటు చేయాలని ఆర్‌ అండ్‌బీ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జోనల్ కమిషనర్ రవి కిరణ్, ట్రాఫిక్ డీసీపీ రాహుల్ హెగ్డే, నార్త్ జోన్ అడిషనల్ డీసీపీ మధుసూదన్, వాటర్ వర్క్స్ సీజీఎం ప్రభు, ఆర్‌ అండ్‌బీ ఈఈ రవీంద్ర మోహన్, జీహెచ్‌ఎంసీ ఈఈ సుదర్శన్, మాజీ కార్పొరేటర్లు అత్తిలి మల్లిఖార్జున్ గౌడ్, శీలం ప్రభాకర్, బీఆర్‌ఎస్‌ నాయకులు తలసాని స్కైలాబ్ యాదవ్, ఆకుల హరికృష్ణ, అత్తిలి శ్రీనివాస్ గౌడ్, తదితరులు ఉన్నారు.