ED Searches At BYJU's:



బెంగళూరులో సోదాలు 


బైజుస్ సీఈవో రవీంద్రన్ ఇంట్లో ఈడీ రెయిడ్స్ జరిగాయి. బెంగళూరులోని ఆయన ఇంట్లో సోదాలు చేపట్టింది. విదేశీ నిధుల వ్యవహారంలో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తోంది ఈడీ. రవీంద్రన్‌కు చెందిన ఇంటితో పాటు ఆయన బిజినెస్ ఆఫీస్‌లలోనూ సోదాలు జరిగాయి. ఇప్పటికే ఆయనపై కేసు నమోదైంది. Think & Learn Private Limited కంపెనీకి సంబంధించి విదేశీ నిధుల విషయంలో నిబంధనలు ఉల్లంఘించారని ఈడీ చెబుతోంది.  Foreign Exchange Management Act నిబంధనల్ని అతిక్రమించారని ఆరోపిస్తోంది. ఈ క్రమంలోనే కొన్ని డాక్యుమెంట్‌లతో పాటు డేటాను కూడా సీజ్ చేసినట్టు వెల్లడించింది. ఈ సోదాలపై బైజుస్ సీఈవో రవీంద్రన్ స్పందించారు. ఇది కేవలం రొటీన్ ఎంక్వైరీ అని తేల్చి చెప్పారు. 


"ఈడీ అధికారులు వచ్చి సోదాలు చేశారు. వాళ్లకు పూర్తి సహకారం అందించాం. వాళ్లకు కావాల్సిన సమాచారం అంతా అందించాం. పారదర్శకంగానే ఉన్నాం. మా కంపెనీపై పూర్తి నమ్మకముంది. మా ఎతిక్స్‌ను ఎప్పుడూ మీరలేదు. వాటికి ఎప్పటికీ కట్టుబడి ఉంటాం"


- రవీంద్రన్, బైజుస్ సీఈవో 






కీలక వివరాలు..


ఫెమా సోదాల్లో కీలక వివరాలు వెల్లడయ్యాయి. కంపెనీకి రూ.28 వేల కోట్లు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల ద్వారా అందాయని తెలిపింది. 2011-2023 మధ్య కాలంలో ఈ నిధులు వచ్చినట్టు స్పష్టం చేసింది. ఓవర్సీస్ డైరెక్ట్ ఇన్వెస్ట్‌మెంట్‌లో భాగంగా బైజుస్ కంపెనీ పలు విదేశీ సంస్థలకు రూ.9,754 కోట్లు పంపింది. ఈ కంపెనీపై వచ్చిన కంప్లెయింట్‌ల ఆధారంగానే  సోదాలు నిర్వహించినట్టు వెల్లడించారు అధికారులు. ఇప్పటికే సమన్లు జారీ చేసినప్పటికీ ఈడీ ముందు రవీంద్రన్‌ హాజరు కాలేదన్న ఆరోపణలున్నాయి. అడ్వర్‌టైజ్‌మెంట్, మార్కెటింగ్ కోసం రూ.944 కోట్లు ఖర్చు చేసినట్టు ఈడీ వెల్లడించింది. ప్రస్తుతం కంపెనీ ఇచ్చిన లెక్కల్ని అధికారులు పరిశీలిస్తున్నారు. బ్యాంకింగ్ అఫీషియల్స్‌తో సంప్రదించిన తరవాతే పూర్తి వివరాలు వెల్లడిస్తామని తెలిపింది. 


లేఆఫ్‌లు..


లేఆఫ్‌ల ట్రెండ్ కొనసాగుతోంది. వరుసగా పెద్ద పెద్ద కంపెనీలు ఉద్యోగులను ఇంటికి పంపుతున్నాయి. కాస్ట్ కటింగ్‌లో భాగంగా పెద్ద ఎత్తున ఉద్యోగులను తొలగిస్తున్నాయి. ప్రముఖ ఎడ్‌టెక్ కంపెనీ Byjusకూడా ఇదే బాట పట్టింది. ఇప్పటికే ఓ విడత లేఆఫ్‌లు అమలు చేసిన ఈ కంపెనీ రెండో ఫేజ్‌నూ మొదలు పెట్టింది. ఈ సారి 1000 మంది ఉద్యోగులను తొలగించనున్నట్టు ఓ నివేదిక అంచనా వేసింది. ఆర్నెల్ల కాలంలోనే ఈ కోతలు విధిస్తూ పోతోంది బైజూస్. డిజైన్, ప్రొడక్షన్, ఇంజనీరింగ్ విభాగాల్లో ఈ సారి లేఆఫ్‌లు ఉండనున్నాయి. ముఖ్యంగా ఇంజనీరింగ్ విభాగంలోని ఉద్యోగులకే ముప్పు ఉన్నట్టు తెలుస్తోంది. ఈ డిపార్ట్‌మెంట్‌లో కనీసం 300 మందికి పింక్‌ స్లిప్ చూపించనున్నారు. లాభాల్లో నడిచేందుకు వీలుగా..మొదటి విడతలో 2,500 మంది ఉద్యోగులను తొలగించింది బైజూస్. 


Also Read: Mark Zuckerberg: ఆ విషయంలో అంబానీ కంటే ముందున్న జుకర్‌బర్గ్‌, టైమ్‌ వస్తే ఎవర్నీ ఆపలేం!