Electoral Bonds Fresh Data: ఎన్నికల సంఘం ఎలక్టోరల్ బాండ్స్‌కి సంబంధించి మరి కొన్ని వివరాలు వెల్లడించింది. రాజకీయ పార్టీల నుంచి సేకరించిన వివరాల్ని వెలువరించింది. ఇప్పటికే సీల్డ్ కవర్స్‌లో వీటిని సుప్రీంకోర్టుకి సమర్పించింది. ఇవి 2019 ఏప్రిల్ 12వ తేదీ కన్నా ముందు వివరాలు అని తెలుస్తోంది. ఆ తరవాతి ఎలక్టోరల్ బాండ్స్‌కి సంబంధించిన వివరాల్ని గత వారమే ఎన్నికల సంఘం వెల్లడించింది. అంతకు ముందు సుప్రీంకోర్టుకి సమర్పించిన ఫిజికల్ కాపీస్‌ని రిజిస్ట్రీ ఈసీకి తిరిగి ఇచ్చింది. వీటితో పాటు డిజిటలైజ్డ్ రికార్డ్, పెన్‌డ్రైవ్‌నీ అందించింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఎన్నికల సంఘం ఈ డిజిటలైజ్డ్ డేటాని వెబ్‌సైట్‌లో పొందుపరిచింది. లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌ని విడుదల చేసిన మరుసటి రోజే ఎలక్టోరల్ బాండ్స్ డేటాని వెలువరించడం కీలకంగా మారింది. ఈ కొత్త డాక్యుమెంట్స్‌లో బాండ్‌ల తేదీలు, డినామినేషన్‌లు, బాండ్స్ సంఖ్య, SBI బ్రాంచ్‌ల వివరాలు, రిసీట్ తేదీలు, జమ అయిన తేదీలు తదితర డేటా ఉంది. అయితే...ఈ బాండ్స్ యునిక్ నంబర్స్‌ని మాత్రం ఈసీ వెల్లడించలేదు. దీనిపై ఇప్పటికే తృణమూల్ కాంగ్రెస్ అసహనం వ్యక్తం చేసింది. SBIకి ఓ లేఖ రాసింది. బాండ్స్‌కి సంబంధించిన యునిక్ నంబర్స్‌ని ఇవ్వాలని, అలా అయితేనే సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా నడుచుకోగలమని స్పష్టం చేసింది. ఇక మాయావతి నేతృత్వంలోని Bahujan Samaj Party (BSP) తమకు ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా ఎలాంటి విరాళాలూ రాలేదని వెల్లడించింది. దీంతో పాటు CPI(M)కి కూడా తమకు ఎలాంటి విరాళాలు రాలేదని ప్రకటించాయి.
తమిళనాడులోని DMK పార్టీకి ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా రూ.656.5 కోట్లు వచ్చినట్టు వెల్లడైంది. దీంతో పాటు Future Gaming సంస్థ నుంచి రూ.509 కోట్ల రూపాయిల అందినట్టు తేలింది. ఎన్నికల సంఘానికి SBI ఇచ్చిన ఎలక్టోరల్ బాండ్స్ వివరాలనే తాము త్వరలోనే ప్రకటిస్తామని కాంగ్రెస్ తెలిపింది. కాంగ్రెస్ గోవా యూనిట్‌కి వాస్కో డి గామాకి చెందిన కంపెనీ నుంచి రూ.30 లక్షల విరాళం అందింది. బీజేపీ త్రిపుర, వెస్ట్ బెంగాల్‌లోని NCP తమకు విరాళాలు అందలేదని స్పష్టం చేసింది. 2018-19 మధ్య కాలంలో BRS కి రూ.230.65 కోట్లు వచ్చాయి. కర్ణాటకలో జేడీఎస్‌కి ఇన్‌ఫోసిస్, ఎంబసీ గ్రూప్, బయోకాన్ గ్రూప్‌ల నుంచి ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా విరాళాలు వచ్చాయి. ఇప్పటి వరకూ వచ్చిన ఎలక్టోరల్ బాండ్స్‌లో 48% మేర బీజేపీకే వచ్చాయి. ఇక కాంగ్రెస్‌కి 11% విరాళాలు అందాయి. 2018 నుంచి రాజకీయ పార్టీలకు వచ్చిన విరాళాల్లో సగానికి పైగా ఎలక్టోరల్ బాండ్స్‌వే ఉన్నాయని Association for Democratic Reforms (ADR) స్పష్టం చేసింది. అయితే...ఈ బాండ్స్ పేరు చెప్పి బీజేపీ ఎన్నో అవకతవకలకు పాల్పడిందని కాంగ్రెస్ తీవ్రంగా ఆరోపిస్తోంది. కేవలం తమ మోసాల్ని కప్పి పుచ్చుకునేందుకే వివరాలు వెల్లడించడానికి వెనకడుగు వేస్తోందని మండి పడుతోంది. ఈ ఆరోపణల్ని బీజేపీ కొట్టి పారేస్తోంది.
Also Read: PM Modi News: వచ్చే ఐదేళ్లలో దేశం రూపు రేఖలు మారుస్తాం: ప్రధాని మోడీ ఆత్మవిశ్వాసం