East Godavari Crime News: తూర్పు గోదావరి జిల్లాలో కొవ్వూరుకు చెందిన ఇసుక వ్యాపారి ప్రేమ్ రాజ్ ఆత్మహత్య చేసుకోవడం సంచలనంగా మారుతోంది. మరణంపై ఆయన సన్నిహితుల, స్నేహితులు, బంధువుల అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆర్థిక అంశాలే బలవన్మరణానికి కారణమని ఆరోపిస్తున్నారు. ప్రేమ్ రాజుకు ఇసుక వ్యాపారంలో ప్రవేశించే వరకూ పెద్దగా ఆర్థిక సమస్యలేమీ లేవని చెబుతున్నారు.
టర్న్ కీ ఎంటర్ ప్రైజెస్‌లో కొవ్వూరుకు చెందిన ప్రేమ్ రాజ్ ఉద్యోగిగా పని చేశారు. ఉమ్మడి పశ్చిమ జిల్లాకు ఇంఛార్జిగా నియమించి ఇసుక తవ్వకాలు, విక్రయాలు, పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించింది. 2022 ఆగస్టు నెలలో టర్న్ కీ సంస్థ ఇసుక వ్యాపారం నుంచి తప్పుకుంది. అప్పటికే ఇసుక వ్యాపారంపై పూర్తి అవగాహన ఉందన్న కారణంతో కొందరి వ్యక్తులతో కలిసి ఇసుక వ్యాపారాన్ని సొంతంగా చేయడం ప్రారంభించారు ప్రేమ్‌రాజ్. 


అప్పటి వరకు ఎలాంటి ఆర్థిక సమస్యలు లేని ప్రేమ్‌రాజ్‌.. కోట్లు ఖర్చు పెట్టి ఒప్పందాలు చేసుకున్నట్టు స్నేహితులు చెబుతున్నారు. ఇందులో భారీగా నష్టాలు వస్తున్నాయని... తనతో జట్టు కట్టిన వాళ్లు డబ్బులు ఇవ్వాలని ఒత్తిడి చేస్తున్నట్టు స్నేహితుల వద్ద వాపోయాడని కూడా చెప్పారు. ఇసుక వ్యాపారం అనుకున్న స్థాయిలో జరగపోవడంతో నెలనెలా ఆర్థికంగా కుంగిపోతూ వచ్చాడని అనుమానం పడుతున్నారు. 


నష్టాలు కొనసాగుతుండగానే ప్రేమ్‌రాజ్‌ను వ్యాపారం నుంచి తప్పించారని స్నేహితులు చెబుతున్నారు. ఇలా నెలనెల వస్తున్న నష్టాలు ఓవైపు.. అప్పటికే పెట్టుబడిగా పెట్టిన డబ్బు తిరిగి రాకపోవడంతో కుంగిపోయారు ప్రేమ్‌రాజ్. మిత్రులు, సన్నిహితుల నుంచి డబ్బులు అప్పు చేసి వ్యాపారంలో పెట్టానని... అందరి వద్ద తలదించుకునే పరిస్థితి వస్తుందని తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. చివరకు రైల్వే ట్రాక్‌పై తలపెట్టి ఆత్మహత్య చేసుకున్నారు. దీనిపై సమగ్ర విచారణ జరపాలని స్నేహితులు, బంధువులు కోరుతున్నారు.