SP leader Kaish Khan found hiding wrapped in mattress: రాజకీయ నాయకులు తెలివి మీరిపోయారు. ఎంతగా అంటే పారిపోయారని ప్రచారం చేసుకుని పోలీసుల్ని మేనేజ్ చేసి .. ఎవరికీ కనిపించకుండా ఉంటారు. లేకపోతే విదేశాలకు వెళ్లిపోతారు. ఇంట్లో మంచం కింద లేకపోతే అటక మీద దాక్కుంటే పోలీసులకు మస్కా కొట్టవచ్చని మాత్రం అనుకోరు.అలా అనుకున్నారంటే అంత కంటే అమాయకమైన రాజకీయ నేతలు ఉండరని అనుకోవచ్చు. ఈ కైషాఖాన్  అలాంటివాడే.                        

ఉత్తరప్రదేశ్‌లోని కన్నౌజ్ జిల్లాలో సమాజ్‌వాదీ పార్టీ   మాజీ ఎంపీ  కైషా ఖాన్ నెల రోజుల నుంచి పరారీలో ఉన్నాడు. ఆయన వరుసగా నేరాలకు పాల్పడుతూండటంతో అధికారులు జిల్లా బహిష్కరణ చేశారు. అయితే ఆయన ఉత్తర్వును ఉల్లంఘించి, తన ఇంటి లాఫ్ట్‌లో పరుపు వెనుక దాక్కున్న స్థితిలో అతన్ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

కైషా ఖాన్, సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్‌కు సన్నిహితుడు. జులై 28, 2025న కన్నౌజ్ జిల్లా అధికారులు అతనిపై జిల్లాబహిష్కరణ ఉత్తర్వు జారీ చేశారు. దీని ప్రకారం అతను ఆరు నెలల పాటు జిల్లా సరిహద్దుల్లో ఉండకూడదు. అయితే, ఈ ఉత్తర్వును ఉల్లంఘించి, అతను తన ఇంటి లాఫ్ట్‌లో పరుపు వెనుక దాక్కున్నాడు. కోట్వాలీ పోలీసు స్టేషన్ అధికారులు గోప్య సమాచారం ఆధారంగా అతని నివాసంలో సోదాలు నిర్వహించి, అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్ సమయంలో, కైషా ఖాన్ దాక్కునేందుకు పరుపులో చుట్టుకుని లాఫ్ట్‌లో ఉన్నట్లు గుర్తించారు.

కైషా ఖాన్‌పై పురావస్తు భూమి ఆక్రమణ, బెదిరింపులు, దోపిడీతో సహా మొత్తం ఐదు క్రిమినల్ కేసులు నమోదయ్యాయి.   జిల్లాబహిష్కరణ ఉత్తర్వును ఉల్లంఘించినందుకు అదనపు చర్యలు ఎదుర్కొనే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. స్థానిక కోర్టు అతనికి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది, దీని ప్రకారం అతను వెంటనే కన్నౌజ్ జిల్లాను విడిచిపెట్టి, ఆరు నెలల పాటు జిల్లా సరిహద్దుల్లోకి రాకూడదని ఆదేశించింది.