Lok Sabha Polls 2024: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కాంగ్రెస్‌కి సవాల్ విసిరారు. సత్తా ఉంటే ఉత్తరాది రాష్ట్రాల్లో బీజేపీని ఎదుర్కోవాలంటూ ఛాలెంజ్ చేశారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌కి కనీసం 40 సీట్లు రావడం కూడా కష్టమే అంటూ జోస్యం చెప్పారు. బెంగాల్‌లో సీట్‌ షేరింగ్ విషయంలో కాంగ్రెస్, తృణమూల్ మధ్య విభేదాలు వచ్చాయి. అప్పటి నుంచి దీదీ ఇలా కాంగ్రెస్‌పై మండి పడుతూనే ఉన్నారు. అయితే..త్వరలోనే ఈ సమస్యని ఓ కొలిక్కి తీసుకొస్తామని రాహుల్ గాంధీ వెల్లడించారు. ఈ వ్యాఖ్యలపైనే మమతా బెనర్జీ ఇలా అసహనం వ్యక్తం చేశారు. అంతే కాదు. భారత్ జోడో న్యాయ్ యాత్రపైనా విమర్శలు గుప్పించారు. బెంగాల్‌లో ఆరు జిల్లాల్లో న్యాయ్ యాత్ర నిర్వహించారు రాహుల్ గాంధీ. కాంగ్రెస్ ఓ వలస పక్షి అంటూ తీవ్రంగా స్పందించారు. కేవలం మైనార్టీ ఓట్లను చీల్చీందుకు ప్రయత్నిస్తోందని ఫైర్ అయ్యారు. 


"దేశవ్యాప్తంగా 300 స్థానాల్లో పోటీ చేయాలని నేను కాంగ్రెస్‌కి సలహా ఇచ్చాను. కానీ..అందుకు ఆ పార్టీ అంగీకరించలేదు. కానీ ఇప్పుడు మా రాష్ట్రంలోకి వచ్చి ముస్లిం ఓట్లను చీల్చే ప్రయత్నాలు చేస్తున్నారు. ఒకవేళ వాళ్లు 300 సీట్లలో పోటీ చేసినా 40 సీట్లలో కూడా గెలుస్తారో లేదో నమ్మకం లేదు"


- మమతా బెనర్జీ, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి


కేంద్రం నుంచి రావాల్సిన నిధులు ఇంకా పెండింగ్‌లో ఉన్నాయని చాలా రోజులుగా మమతా బెనర్జీ అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈక్రమంలోనే ఓ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగానే కాంగ్రెస్‌పై ఇలా మండి పడ్డారు. ఇప్పటికీ ఆ పార్టీతో పొత్తు పెట్టుకునేందుకు ఎలాంటి అభ్యంతరం లేదని, కానీ తన ప్రతిపాదనలు కాంగ్రెస్ పట్టించుకోవడం లేదని అన్నారు. తాము రెండు సీట్‌లు ఇస్తామని చెప్పినా ఒప్పుకోలేదని తేల్చి చెప్పారు. 


"ఇప్పటికీ మేం కూటమిలో ఉండడానికి అభ్యంతరం లేదు. రెండు స్థానాల్లో పోటీ చేయాలని నేను ప్రతిపాదించాను. కానీ ఆ పార్టీ అందుకు ఒప్పుకోలేదు. ఇప్పుడు వాళ్లు 42 నియోజకవర్గాల్లోనూ ఒంటరిగా పోటీ చేయనివ్వండి. చాలా రోజులుగా మా మధ్య మాటలు లేవు. మేం ఒంటరిగానే పోటీ చేసి బీజేపీని ఓడిస్తాం"


- మమతా బెనర్జీ, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి


 చాలా చర్చల తరవాత స్వయంగా మమతా బెనర్జీ ఓ ప్రకటన చేశారు. బెంగాల్‌లో కాంగ్రెస్‌తో సీట్‌లు పంచుకునేందుకు సిద్ధంగా లేమని మొత్తం 42 చోట్లా తామే నిలబడతామని స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తృణమూల్ కాంగ్రెస్‌తో సీట్‌ల షేరింగ్ సమస్యని పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నామని  వెల్లడించారు. మమతా బెనర్జీ లేకుండా I.N.D.I.A కూటమి ఊహించుకోలేమని అన్నారు. బీజేపీతో పోరాడే సత్తా ఆమెకు ఉందని గట్టిగా విశ్వసిస్తున్నామని స్పష్టం చేశారు. సీట్‌ షేరింగ్ సమస్య గురించి రన్నింగ్ కామెంట్రీ ఇచ్చే ఉద్దేశం తనకు లేదని, కానీ దీనికి ఓ పరిష్కారం వెతికే ప్రయత్నాన్ని మాత్రం మానుకోలేదని వెల్లడించారు జైరాం రమేశ్. 


Also Read: LK Advani Political Journey: రథయాత్ర నుంచి భారతరత్న వరకూ, అద్వానీ రాజకీయ ప్రస్థానంలో ఎన్నో మైలురాళ్లు