Donald Trump : ఇటీవల జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో గెలిచి.. మరికొన్ని రోజుల్లో అమెరికా ప్రెసిడెంట్ గా బాధ్యకలు చేపట్టబోతున్న డోనాల్డ్ ట్రంప్ రెండోసారి అధ్యక్షుడిగా తన సత్తాను చూపేందుకు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో ఆ దేశంలో మరణశిక్ష అమలుపై కఠిన నిర్ణయం తీసుకోనున్నట్టు సోషల్ మీడియా వేదికగా తెలిపారు. తాను అధ్యక్షుడు అయ్యాక రేపిస్టులు, హంతకులకు మరణశిక్ష అమలుచేసేందుకు ఆదేశాలిస్తానని కరాఖండిగా చెప్పేశారు.


బైడెన్ నిర్ణయంపై ట్రంప్ తీవ్ర విమర్శలు


ప్రస్తుతం అమెరికా అధ్యక్షుడిగా కొనసాగుతోన్న జోబైడెన్.. ఇటీవల ఫెడరల్ మరణశిక్షను ఎదుర్కొంటున్న 40మంది ఖైదీల్లో 37మందికి శిక్షను తగ్గించారు. ఈ నిర్ణయాన్ని కాబోయే అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ వ్యతిరేకించారు. జో బైడెన్ దేశంలోని 37 మంది హంతకులకు మరణిశిక్ష తగ్గించారు. నేను అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన వెంటనే రేపిస్టులు, హంతకులకు మరణశిక్ష అమలుచేయాలని న్యాయశాఖకు ఆదేశిస్తాను. ఈ నిర్ణయం అమెరికన్ ప్రజలకు రక్షణగా ఉంటుంది. దేశంలో మళ్లీ శాంతిభద్రతలు పునరుద్ధరిస్తానని ట్రంప్ రాశారు. దీంతో మరణిశిక్షపై బైడెన్ విధించిన మారటోరియాన్ని ట్రంప్ వచ్చాక ఎత్తేస్తారనే ఆలోచనతోనే ఖైదీలకు మరణశిక్ష తగ్గించారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. శిక్ష తగ్గింపుపై ట్రంప్ చేసిన వ్యాఖ్యలను బట్టి చూస్తుంటే రాబోయే రోజుల్లో మరణశిక్షపై ఎలాంటి సడలింపులు ఉండవనేది స్పష్టంగా తెలుస్తోంది.


ముఖ్యంగా ఓ చిన్న పిల్లని హత్యాచారం చేసిన ఘటనలో శిక్ష అనుభవిస్తున్న పలువురు నిందితులకు కూడా మరణశిక్ష విధిస్తే.. దాన్ని బైడెన్ జీవిత ఖైదుగా మార్చారంటూ ట్రంప్ ఈ సందర్భంగా ఆవేదన వ్యక్తం చేశారు. అలాంటి వాళ్లను అస్సలే వదిలి పెట్టకూడదని చెప్పుకొచ్చారు. దోషులు చేసిన నేరాల గురించి తెలిస్తే... వారికి శిక్షలు తగ్గించాలనే ఆలోచన ఎవరికీ రాదని ట్రంప్ వివరించారు.


2003 నుంచి ట్రంప్ మొదటిసారి అధికారంలో వచ్చేవరకు ఫెడరల్ ఖైదీలకు మరణశిక్ష అమలుచేయలేదు. కానీ ట్రంప్ వచ్చిన 6నెలల్లోనే 13మందికి శిక్ష అమలుచేశారు. ఆ తర్వత చివరిసారి జనవరి 16, 2021న శిక్ష విధించింది. ప్రస్తుతం ఈ జాబితాలో 40మంది ఉండగా.. వీరిలో 37మందికి ఇటీవల జో బైడెన్ క్షమాభిక్షకు అవకాశమిచ్చారు. కానీ ముగ్గురికి మాత్రం ఈ శిక్ష నుంచి మినహాయించారు. అందులో 2013 బోస్టన్ మారథాన్ బాంబర్లలో ఒకరు, 2018లో 11 మంది యూదు ఆరాధకులను హత్య చేసిన ముష్కరుడు, 2015లో తొమ్మిది మంది నల్లజాతి చర్చికి వెళ్లేవారిని కాల్చిచంపిన శ్వేతజాతీయుల ఆధిపత్యవాది ఉన్నారు.


Also Read : Sriram Krishnan: ట్రంప్ కొత్త AI సలహాదారుగా భారతీయ సంతతికి చెందిన వ్యక్తి, ఇంతకీ ఎవరీయన


మరణశిక్షలకు సంబంధించి ప్రపంచంలో ఆయా దేశాల్లో వేర్వేలు చట్టాలు, నిబంధనలు ఉన్నాయి. అదే తరహాలో అమెరికాలోని వేర్వేరు రాష్ట్రాల్లోనూ ఇతర రూల్స్ ఉన్నాయి. వీటిలో కొన్ని ఆ రాష్ట్రాలు మాత్రమే అమలు చేస్తున్నారు. తోటి ఖైదీలను చంపిన వారు, బ్యాంకు దోపిడీలో టైంలో హత్యలు చేసిన వారికి వీటిని అమలు చేస్తోంది. ఇలా 1988 నుంచి 2021 వరకు మొత్తంగా 79మందికి శిక్ష పడింది. అత్యంత అరుదుగా వీటిని అమలు జరుగుతోంది. అయితే వీరిలో ఇప్పటివరకు కేవలం 16మందికి మాత్రమే శిక్ష అమలు చేయడం గమనార్హం. ఇకపోతే అమెరికాలోని మొత్తం 50 రాష్ట్రాల్లో 23 రాష్ట్రాలు మరణిశిక్షను పూర్తిగా రద్దు చేశారు. మరో 6 రాష్ట్రాలు మాత్రం వీటిని తాత్కాలికంగా నిలిపివేశారు. ఇక 2024లో మొత్తం దేశవ్యాప్తంగా 25 మరణిశిక్షలు అమలుచేసినట్టు పలు నివేదికలు సూచిస్తున్నాయి.