DMK MLA Anitha Radhakrishnan Arrest: తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ , ప్రముఖ నటి త్రిష కృష్ణన్ లపై అనుచిత వ్యాఖ్యల కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. ఈ వ్యవహారంలో ప్రధాన నిందితుడిగా ఉన్న అధికార ప్రతిపక్ష డీఎంకే సీనియర్ నేత, తిరుచెందూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే అనితా రాధాకృష్ణన్‌ను శుక్రవారం తమిళనాడు పోలీసులు అధికారికంగా అరెస్ట్ చేశారు. మద్రాస్ హైకోర్టు ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్‌ను నిర్ద్వంద్వంగా తిరస్కరించిన కొద్దిసేపటికే పోలీసులు ఆయన్ను ఆత్తూరులో అదుపులోకి తీసుకున్నారు.
ఈ వివాదానికి ప్రధాన కారణం జూన్ 20న తూత్తుకుడి జిల్లా ఆత్తూరులో జరిగిన మాజీ సీఎం కరుణానిధి జయంతి వేడుకల బహిరంగ సభ. ఆ వేదికపై అనితా రాధాకృష్ణన్ మాట్లాడుతూ.. సీఎం విజయ్ సినిమా రంగాన్ని వీడి రాజకీయాల్లోకి రావడం, ఇటీవల అసెంబ్లీలో ఆయన వ్యవహరిస్తున్న శైలిని ఎగతాళి చేశారు. జూన్ 22న విజయ్ పుట్టినరోజు సందర్భంగా నటి త్రిష సోషల్ మీడియాలో షేర్ చేసిన ఒక పోస్ట్‌ను కూడా ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు. "తాను రాజకీయాల్లో ఇలా ఇరుక్కుపోయానని విజయ్ లోలోపల బాధపడుతూ ఉంటారు.. ఇంట్లో నటి తో ఎంతో సంతోషంగా ఉండేవాడినని ఆయన గుర్తుచేసుకుంటున్నారేమో?" అంటూ ఇద్దరి వ్యక్తిగత జీవితంపై తీవ్ర పరువు నష్టం కలిగించేలా, అత్యంత అభ్యంతరకర రీతిలో వ్యాఖ్యానించారు.
ఈ వ్యాఖ్యలపై టీవీకే పార్టీ శ్రేణులు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేయగా.. అనితా రాధాకృష్ణన్ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. అయితే జస్టిస్ జి.కె. ఇళంతిరైయన్ ఈ పిటిషన్‌ను తిరస్కరిస్తూ.. ఏడు సార్లు ఎమ్మెల్యేగా, మాజీ మంత్రిగా పనిచేసిన వ్యక్తి.. ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న ముఖ్యమంత్రిపై ఇంతటి దిగజారుడు భాషను ఎలా ఉపయోగిస్తారు అని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అనితా రాధాకృష్ణన్ చేసిన ఈ వ్యాఖ్యల వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారడంతో రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర దుమారం రేగింది. ఒక మహిళా నటిని, అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రిని ఉద్దేశించి ఇంతటి చీప్ పాలిటిక్స్ చేయడంపై నెటిజన్లు సైతం మండిపడ్డారు. టీవీకే ఆత్తూరు అర్బన్ సెక్రటరీ ఎస్. సెల్వం ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఆత్తూరు పోలీసులు ఆయనపై భారతీయ న్యాయ సంహిత లోని సెక్షన్ 352 , సెక్షన్ 353(2) కింద నాన్-బెయిలబుల్ కేసులు నమోదు చేశారు.
మరోవైపు, ఈ అరెస్టుపై డీఎంకే అధినేత ఎం.కె. స్టాలిన్ తీవ్రంగా స్పందించారు. కేవలం పరువు నష్టం వ్యాఖ్యల కేసులో ఒక సిట్టింగ్ ఎమ్మెల్యేను ఇంత అత్యవసరంగా అరెస్ట్ చేయడం పూర్తిగా రాజకీయ కక్షసాధింపు చర్యేనని ఆయన ఆరోపించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలను కాపాడలేని కూటమి ప్రభుత్వం.. ప్రతిపక్ష నేతలను అణచివేయడానికే ఇలాంటి అప్రజాస్వామిక పద్ధతులకు పాల్పడుతోందని విమర్శించారు. ఏదేమైనా, సినీ గ్లామర్‌తో పాటు రాజకీయంగా దూసుకుపోతున్న సీఎం విజయ్‌ను వ్యక్తిగతంగా టార్గెట్ చేయబోయి.. డీఎంకే సీనియర్ నేత చివరకు కటకటాల పాలవ్వడం తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త ప్రకంపనలు సృష్టిస్తోంది.
