Tamil Nadu Assembly Elections 2026: స్టాలిన్ వ్యూహాలతో మారిపోతున్న తమిళనాడు రాజకీయాలు - వార్ వన్ సైడ్ అవుతోందా?
TamilNadu Politics: తమిళనాడులో ఎన్నికలు దగ్గర పడేకొద్దీ కొత్త సమీకరణాలు వస్తున్నాయి. విజయ్ కాంత్ పార్టీ డీఎంకే నీడన చేరడం హాట్ టాపిక్ గా మారింది.

DMDK entry into DMK alliance: తమిళనాడు రాజకీయాలు రోజు రోజుకు ఆసక్తికరంగా మారుతున్నాయి. రెండు దశాబ్దాల తర్వాత డీఎండీకే పార్టీ..డీఎంకే కూటమిలోకి వచ్చింది. 2005లో పార్టీ స్థాపించినప్పటి నుండి డీఎంకేకు బద్ధ వ్యతిరేకిగా ఉన్న విజయకాంత్ కుటుంబం, ఇప్పుడు అదే పార్టీతో జట్టు కట్టడం వెనుక బలమైన రాజకీయ సమీకరణాలు ఉన్నాయి. కెప్టెన్‌గా అందరూ పిలుచుకునే విజయకాంత్ బతికున్నంత కాలం డీఎంకేను తీవ్రంగా వ్యతిరేకించారు. అయితే, ఆయన మరణం తర్వాత డీఎండీకే రాజకీయ అస్తిత్వం కోసం పోరాడుతోంది. ప్రస్తుతం రాష్ట్రంలో ముఖ్యమంత్రి స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే కూటమి అత్యంత బలంగా ఉంది.
డీఎండీకే ప్రస్తుత బలం ఎంత?
అన్నాడీఎంకే చీలికలు, బీజేపీ ఎదుగుదల వంటి పరిణామాల మధ్య ఒంటరిగా వెళ్లడం కంటే, గెలిచే గుర్రంపై పందెం వేయడమే మేలని ప్రస్తుతం పార్టీని నడుపుతున్న విజయ్‌కాంత్ సతీమణి ప్రేమలత భావించారు. ఈ పొత్తు ద్వారా డీఎండీకేకు ఒక రాజ్యసభ స్థానంతో పాటు, సుమారు 6 నుండి 10 అసెంబ్లీ స్థానాలు దక్కే అవకాశం ఉందని సమాచారం. 2011లో డీఎండీకే 7.9 శాతం ఓట్లతో ప్రధాన ప్రతిపక్షంగా నిలిచిన డీఎండీకే బలం ఇప్పుడు గణనీయంగా తగ్గింది. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో ఈ పార్టీ ఓట్ల శాతం కేవలం 0.43% కి పడిపోయింది. అయితే, ఉత్తర తమిళనాడులో వన్నియర్లు , మధ్యతరగతి వర్గాల్లో ఇప్పటికీ కెప్టెన్ పట్ల ఉన్న సానుభూతి, అభిమానం కొంత ఓటు బ్యాంకును కలిగి ఉన్నాయి. క్షేత్రస్థాయిలో డీఎండీకే కార్యకర్తల నెట్‌వర్క్ డీఎంకే అభ్యర్థుల విజయానికి అదనపు బలాన్ని ఇవ్వగలదు.
డీఎంకే కూటమికి ఓట్లు కలసి వస్తాయా?
వరుస విజయాలతో దూసుకుపోతున్న డీఎంకేకు ఈ పొత్తు వల్ల గణాంకాల పరంగా పెద్దగా ఒరిగేది లేకపోయినా, రాజకీయంగా ఇది నైతిక విజయం . విజయకాంత్ లాంటి కరుడుగట్టిన విమర్శకుడి పార్టీ తమతో చేరడం వల్ల ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోకుండా ఉంటుంది. అంతేకాకుండా, అన్నాడీఎంకే కూటమిని మరింత బలహీనపరచడానికి ఇది ఒక ఎత్తుగడ. సుమారు 1 నుండి 2 శాతం వరకు ఉన్న డీఎండీకే ఓట్లు బదిలీ అయితే, హోరాహోరీగా సాగే నియోజకవర్గాల్లో డీఎంకేకు విజయం సులభమవుతుంది.
డీఎంకే కంటే డీఎండీకేకే లాభం
ఈ పొత్తును సోషల్ మీడియాలో నెటిజన్లు మిశ్రమంగా స్పందిస్తున్నారు. విజయకాంత్ ఆత్మ శాంతించదని బీజేపీ విమర్శిస్తుండగా, కెప్టెన్ కోరికను ఇప్పుడు నెరవేరుస్తున్నాం అని ప్రేమలత సమర్థించుకుంటున్నారు. సుదీర్ఘకాలం డీఎంకేను వ్యతిరేకించిన కార్యకర్తలు ఇప్పుడు ఆ పార్టీ జెండా మోయడం ఎంతవరకు సాధ్యమనేది ఒక సవాల్. ఒకవేళ ఓట్ల బదిలీ సక్రమంగా జరిగితే, 2026లో డీఎంకే కూటమి 200కు పైగా స్థానాలు సాధించాలనే లక్ష్యానికి ఇది తోడ్పడుతుంది. మొత్తంగా చూస్తే, డీఎండీకేకు ఇది తన ఉనికిని కాపాడుకునే సంజీవని లాంటి పొత్తు. డీఎంకేకు మాత్రం ఇది తన ఆధిపత్యాన్ని నిరూపించుకునే మరో అస్త్రం. అన్నాడీఎంకే కూటమి నుండి ఒక మిత్రపక్షాన్ని లాగేయడం ద్వారా స్టాలిన్ విపక్షాలను రక్షణలో పడేశారు.























