Supreme Court on Muslim Women Alimony: ముస్లింల భరణంపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు చేసింది. విడాకులు తీసుకున్న ఓ ముస్లిం మహిళ తన భర్త నుంచి భరణం పొందే హక్కు ఉందని తేల్చి చెప్పింది. Code of Criminal Procedure లోని సెక్షన్ 125 అందుకు అవకాశం కల్పిస్తుందని స్పష్టం చేసింది. విడాకుల తరవాత మహిళలు భరణం తీసుకునేందుకు అర్హులేనని వెల్లడించింది. జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ అగస్టైన్‌తో కూడిన ధర్మాసనం ఈ తీర్పునిచ్చింది. భార్యతో విడాకులు తీసుకున్న తరవాత భరణం ఇవ్వాలని ఆదేశాలివ్వడాన్ని సవాల్ చేస్తూ ఓ వ్యక్తి పిటిషన్ వేశాడు. ఈ పిటిషన్ విచారించిన కోర్టు ఈ తీర్పు వెల్లడించింది. ఆ పిటిషన్‌ని కొట్టి వేసింది. మతాలతో సంబంధం లేకుండా భరణం పొందే హక్కు ప్రతి మహిళకీ ఉంటుందని స్పష్టం చేసింది. భరణం అనేది ఏమీ విరాళం కాదని మండిపడింది. అది పెళ్లైన ప్రతి మహిళ హక్కు అని స్పష్టం చేసింది.
"ఇంటిపట్టున ఉండే భార్య తమపైనే ఆధారపడి ఉంటుందన్న కనీస ఇంగితం కూడా కొంతమంది భర్తలకు ఉండడం లేదు. ఎమోషనల్‌గా కూడా అలాంటి మహిళలు భర్తపైనే ఆధారపడి ఉంటారు. ఇప్పటికైనా హౌజ్‌వైఫ్‌ల విలువని, వాళ్లెంత త్యాగాన్ని చేస్తున్నారో పురుషులు అర్థం చేసుకోవాలి"
- సుప్రీంకోర్టు
ఇంటిపట్టునే ఉండి పనులన్నీ చేసుకునే మహిళలను ఉద్దేశించి కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. భర్తలు తమ భార్యలకు ఆర్థిక సాయం అందించాల్సిన బాధ్యత ఉందని తేల్చి చెప్పింది. జాయింట్ బ్యాంక్ అకౌంట్‌లు మెయింటేన్ చేయాలనీ సూచించింది. వాళ్ల ఆర్థిక స్థిరత్వానికి భరోసా కల్పించాలని అభిప్రాయపడింది. ఈ తీర్పుని పలు పార్టీల నేతలు సమర్థిస్తున్నారు. ముస్లిం మహిళల హక్కులని కాపాడాల్సిన అవసరముందని అభిప్రాయపడుతున్నారు.
"భర్తలందరూ తమ భార్యలకు ఆర్థికంగా తోడ్పాటునందించాల్సిన అవసరం, బాధ్యత ఉన్నాయి. జాయింట్ బ్యాంక్ అకౌంట్ ఉండి తీరాలి. వాళ్లకి ATM కార్డ్‌ల యాక్సెస్ కూడా ఇవ్వాలి. వాళ్ల ఆర్థికంగా నిలదొక్కుకునేలా అన్ని విధాలుగా భరోసా ఇవ్వాల్సిన బాధ్యత భర్తలదే. మతాలతో సంబంధం లేకుండా అందరూ కచ్చితంగా భార్యకి భరణం ఇవ్వాల్సిందే"
- సుప్రీంకోర్టు
Also Read: Patanjali Products: పతంజలి ఉత్పత్తుల విక్రయాలు బంద్, సంచలన నిర్ణయం తీసుకున్న సంస్థ