CJ Roy Brother sensational comments: బెంగళూరులో రివాల్వర్‌తో కాల్చుకుని ప్రాణాలు తీసుకున్న కాన్ఫిడెంట్ గ్రూప్ ఛైర్మన్ సీజే రాయ్ మృతి పారిశ్రామిక వర్గాలను షాక్‌కు గురి చేసింది. ఈ విషాద ఘటనపై ఆయన సోదరుడు సీజే బాబు తీవ్ర ఆరోపణలు చేశారు. రాయ్ మరణానికి ఆదాయపు పన్ను అధికారుల వేధింపులే కారణమని స్పష్టం చేశారు. తన సోదరుడికి ఎలాంటి అప్పులు లేవని, వ్యాపారపరంగా కూడా ఎటువంటి ఒత్తిడి లేదని.. కేవలం గత కొన్ని రోజులుగా ఐటీ అధికారులు పెడుతున్న మానసిక ఒత్తిడి వల్లే ఆయన ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారని బాబు ఆవేదన వ్యక్తం చేశారు. కేరళకు చెందిన ఐటీ అధికారుల బృందం ఉద్దేశపూర్వకంగానే రాయ్‌ను వేధించిందని ఆయన ఆరోపించారు.
గత మూడు రోజులుగా ఐటీ అధికారులు రాయ్ నివాసం, కార్యాలయాల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. నిజానికి రాయ్ తన కుటుంబంతో కలిసి దుబాయ్‌లో ఉండగా, విచారణ పేరుతో అధికారులు ఆయనను బెంగళూరుకు రప్పించినట్లు సమాచారం. శుక్రవారం మధ్యాహ్నం సుమారు 3:15 గంటల సమయంలో, అధికారులు తన కార్యాలయంలోని ఒక గదిలో రాయ్‌ను ప్రశ్నిస్తుండగా, ఆయన ఫోన్ మాట్లాడాలని పక్క గదిలోకి వెళ్లి తన లైసెన్స్డ్ తుపాకీతో కాల్చుకున్నారు. తుపాకీ పేలిన శబ్దం విని అధికారులు, సిబ్బంది వెళ్లి చూసేసరికి ఆయన రక్తపు మడుగులో పడి ఉన్నారు. వెంటనే ఆసుపత్రికి తరలించినప్పటికీ ఫలితం లేకపోయింది.
ఐటీ అధికారులపై కేసు నమోదు చేయాలని రాయ్ కుటుంబం భావిస్తోంది. తిరువనంతపురానికి చెందిన అడిషనల్ కమిషనర్ స్థాయి అధికారి రాయ్‌పై విపరీతమైన ఒత్తిడి తెచ్చారని, అన్ని డాక్యుమెంట్లు సమర్పించినప్పటికీ పదేపదే వేధింపులకు గురిచేశారని బాబు పేర్కొన్నారు. ఘటన జరిగిన సమయంలో రాయ్ భార్య లీనా రాయ్, కుమారుడు రోహిత్ దుబాయ్‌లో ఉండగా, సమాచారం అందిన వెంటనే వారు బెంగళూరు చేరుకున్నారు. శనివారం బౌరింగ్ ఆసుపత్రిలో రాయ్ పార్థివ దేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఈ ఘటనపై ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించారు.
సీజే రాయ్ కేవలం ఒక బిల్డర్ మాత్రమే కాకుండా సినిమా రంగంలోనూ పెట్టుబడులు పెట్టారు. ఇటీవల ఐడెంటిటీ అనే సినిమా నిర్మాణంలోనూ భాగస్వామి అయ్యారు. దాదాపు రెండు దశాబ్దాలుగా రియల్ ఎస్టేట్ రంగంలో తిరుగులేని శక్తిగా ఎదిగిన ఆయన, ఐటీ సోదాల సమయంలో ఇలా ప్రాణాలు తీసుకోవడం వెనుక ఉన్న అసలు కారణాలను వెలికితీయాలని పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. ప్రస్తుతం పోలీసులు ఫోరెన్సిక్ నిపుణుల సహాయంతో ఘటనా స్థలంలో కీలక ఆధారాలను సేకరిస్తున్నారు.
