Rajanna Dora: పార్వతీపురం మన్యం జిల్లా(Parvatipuram Manyam District) సాలూరు(Saluru)లో నివసించే సెటిలర్లపై ఉప ముఖ్యంత్రి, సాలూరు ఎమ్మెల్యే పీడిక రాజన్న దొర సంచలన వ్యాఖ్యలు చేశారు. సాలూరు అంతా సెటిలర్ల వల్ల నష్ట పోతుందని రాజన్న దొర అన్నారు. గిరిజన గ్రామాల్లో రోడ్లేసినా, వంతెనలు కట్టినా గిరిజనులకు ఉపయోగం తక్కువని, ఎక్కువగా సెటిలర్లే ఉపయోగించు కుంటున్నారని రాజన్న దొర వ్యాఖ్యానించారు. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మండలం మావుడి, కొట్టు పరువు పంచాయతీల్లో ఉప ముఖ్యమంత్రి రాజన్న దొర గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు.


ఈ సందర్భంగా రాజన్న దొర మాట్లుడుతూ.. ఇక్కడ వ్యవసాయం, వ్యాపారాలు చేస్తున్న సెటిలర్ల వల్లే రోడ్లు నాశనం అవుతున్నాయని అన్నారు. భారీ వాహనాలను తిప్పుతుండటం వల్ల రోడ్లపై గుంతలు పడుతున్నాయని చెప్పుకొచ్చారు. ఇలా పాడైన రోడ్లను బాగు చేయడానికి ఏ ఒక్కరూ ముందుకు రావడం లేదని రాజన్న దొర విమర్శించారు. గిరిజనులకు న్యాయం చేసేందుకు ఈ విషయాన్ని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి దృష్టికి తీసుకు వెళ్తామని తెలిపారు. సాలూరు ప్రాంతాన్ని షెడ్యూల్డ్ ఏరియాగా ప్రకటించాలని కోరుతాని పేర్కొన్నారు. సాలూరు షెడ్యూల్డ్ ఏరియాగా మారితే సెటిలర్లు నష్ట పోతారని రాజన్న దొర వ్యాఖ్యానించారు. 


గిరిజనుల వద్ద సంపాధించుకుని అభివృద్ధికి సహకరించట్లే..!


చౌదరి, రెడ్డి కులాలకు సంబంధించిన వారు ఎక్కువగా ఉండటంతో సాలూరు అభివృద్ధిని చౌదరి, రెడ్డిలు అడ్డు కుంటున్నారని డిప్యూటీ సీఎం రాజన్న దొర అసహనం వ్యక్తం చేశారు. సెటిలర్లు అందరూ గిరిజనులకు అన్యాయం చేస్తున్నారని రాజన్న దొర మండి పడ్డారు. బబ్లూ అనే వ్యక్తి పేరు సంభోదిస్తూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. సెటిలర్లు గిరిజనుల వద్ద సంపాదించుకుని.. అడవి బిడ్డల అభివృద్ధికి, గ్రామాల అభివృద్ధికి ఏమాత్రం సహకరించడం లేదని డిప్యూటీ సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. సాలూరు మండలం కొట్టు పరువు గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న సమయంలో గిరిజనులు రాజన్న దొరను కలిశారు. కొట్టు పరువు నుంచి కందుల పదం వరకు సుమారు 2 కిలోమీటర్ల మేర రోడ్డు నిర్మాణం ఆగి పోయిందని గ్రామస్థులు రాజన్న దొర దృష్టికి తీసుకెళ్లారు. కొట్టు పరువు పంచాయతీలో రోడ్డు వేయాలని చూస్తే ఓ సెటిలర్ ఆపారని, అది సరికాదని రాజన్న దొర అన్నారు. గిరిజిన ప్రాంతాల్లోని మౌలిక వసతులు అన్నింటిని సెటిలర్లే వాడుకుంటున్నారని అన్నారు. 


గిరిజన ప్రాంతాల్లో స్థానికేతరులు ఉండేందుకు వీలు లేదు


ఈ ప్రాంతాల్లో స్థానికేతరులు వందల ఎకరాల్లో ఎన్నో వాణిజ్య పంటలు పండిస్తున్నారని ఉప ముఖ్యమంత్రి రాజన్న దొర తెలిపారు. వారు గిరిజన గ్రామానికి నాలుగు అడుగుల భూమిని ఇమ్మంటే వారు ససేమిరా అంటున్నారని రాజన్న దొర అన్నారు. ఇలాంటి ధోరణితో సెటిలర్లు ఉన్నట్లు అయితే గిరిజన ప్రాంతాల్లో స్థానికేతరులు ఉండడానికి వీలు లేకుండా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి ఫిర్యాదు చేస్తానని ఉప ముఖ్యమంత్రి, సాలూరు ఎమ్మెల్యే రాజన్న దొర హెచ్చరించారు.