Delhi Ministers Resignation:



ఢిల్లీ రాజకీయాల్లో కీలక పరిణామం జరిగింది. మంత్రులు సత్యేంద్ర జైన్, మనీశ్ సిసోడియా రాజీనామా చేశారు. మంత్రి పదవులకు రాజీనామా చేస్తూ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌కు లేఖలు పంపారు. ఈ మేరకు కేజ్రీవాల్ వీరిద్దరి రాజీనామాలను ఆమోదించారు. మనీశ్ సిసోడియాకు 18 మంత్రిత్వ శాఖల బాధ్యత అప్పగించారు కేజ్రీవాల్. అంతకు ముందు ఆరోగ్య శాఖ మంత్రిగా వ్యవహరించారు సత్యేంద్ర జైన్‌. అయితే ఆయన కూడా ఓ స్కామ్‌లో భాగంగా అరెస్ట్ అయ్యారు. దాదాపు 10 నెలలుగా జైల్లోనే ఉంటున్నారు. ఆయన జైలుకి వెళ్లిన తరవాత ఆరోగ్య శాఖ కూడా సిసోడియాకు అప్పగించారు కేజ్రీవాల్. ఇప్పుడు సిసోడియా కూడా సీబీఐ కస్టడీలో ఉన్నారు. లిక్కర్ స్కామ్‌లో మనీలాండరింగ్‌కు పాల్పడినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. సీబీఐ అరెస్ట్ చేసినప్పటికీ సిసోడియా మంత్రిత్వ పదవిలో ఎలా కొనసాగుతున్నారంటూ బీజేపీ ఇప్పటికే ప్రశ్నలు సంధించింది. ఆ వెంటనే ఇద్దరు మంత్రులు రాజీనామా చేయడం సంచలనమైంది.