Delhi MCD Election Results 2022:


15 వార్డులలోAIMIM పోటీ..


ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. ఇప్పటి వరకూ ఉన్న లెక్కల ప్రకారం చూస్తే...ఆప్ ముందంజలో ఉంది. బీజేపీ రెండో స్థానంలో..కాంగ్రెస్ మూడో స్థానంలో ఉన్నాయి. అయితే...ఈ పార్టీలతో పాటు AIMIM కూడా బరిలోకి దిగింది. అసదుద్దీన్ ఒవైసీ వచ్చి జోరుగా ప్రచారం కూడా చేశారు. అటు గుజరాత్‌లోనే కాకుండా...ఢిల్లీలోనూ క్యాంపెయినింగ్ నిర్వహించారు. మొత్తం 15 వార్డులలో అభ్యర్థులను నిలబెట్టారు. ప్రస్తుత కౌంటింగ్ ట్రెండ్‌ని పరిశీలిస్తుంటే...AIMIM ఎక్కడా ఖాతా కూడా తెరవలేదు. అసలు ఆ పార్టీ ఊసులో కూడా లేనట్టే కనిపిస్తోంది. ఇప్పటి వరకూ జరిగిన కౌంటింగ్ ఆధారంగా చూస్తే...కనీసం 1% ఓటు షేర్ కూడా రాబట్టుకోలేదు ఈ పార్టీ. బ్రిజ్‌పురి ప్రాంతంలో లీడ్‌లో ఉన్నప్పటికీ...ఇంత వరకూ ఎక్కడా ఒక్క అభ్యర్థి కూడా గెలవలేదు. ఇప్పటి వరకూ AIMIMకి వచ్చిన ఓటు శాతం 0.53% మాత్రమే. ఆప్‌ పార్టీకి మాత్రం ఈ ఎన్నికలు ఎంతో ధైర్యాన్నిచ్చాయి. బీజేపీ కంటే దాదాపు అన్ని చోట్లా లీడ్‌లో కొనసాగుతోంది. ఆప్‌ ప్రభంజనంలో మిగతా పార్టీలన్నీ వెనక బడిపోయాయి. ఎర్లీ ట్రెండ్స్‌ చూసి ఆమ్‌ఆద్మీ పార్టీ మాత్రం ధీమా వ్యక్తం చేస్తోంది. తమ పార్టీ 180 సీట్లు గెలుస్తుందని ఆప్‌ ఎమ్మెల్యే సౌరభ్‌ భరద్వాజ్‌ విశ్వాసం వ్యక్తం చేశారు. తమ పార్టీ నుంచే మేయర్‌ ఎన్నికవుతారని తెలిపారు. ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాలే నిజం కాబోతున్నాయన్నారు. 


ముందస్తు సర్వేలు..


మొత్తం 250 వార్డులకు ఈ నెల 4న ఎన్నికలు జరిగాయి. ఆప్‌, బీజేపీ, కాంగ్రెస్‌, స్వతంత్రులు కలిపి మొత్తం 1349 మంది అభ్యర్థులు ఈ ఎన్నికల బరిలో నిలిచారు. ఓట్ల లెక్కింపు నేపథ్యంలో కౌంటింగ్ కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా 10 వేల మంది దిల్లీ పోలీసులను అక్కడ మోహరించారు. అయితే ఇటీవల విడుదలైన ఎగ్జిట్ పోల్ సర్వేలు MCD పీఠం ఆప్‌దేనని స్పష్టం చేశాయి. 15 ఏళ్లుగా భాజపా చేతిలోనే ఉన్న్ MCDని ఈసారి ఆప్‌ కైవసం చేసుకుంటుందని స్పష్టం చేశాయి. 250 వార్డులకు గాను ఆప్‌ 155 వార్డుల్లో విజయం సాధిస్తుందని సర్వేలు తేల్చాయి. అటు గుజరాత్‌ ఎగ్జిట్ పోల్స్ మాత్రం ఆప్‌నకు వ్యతిరేకంగా వచ్చాయి. ఈ ఎగ్జిట్ పోల్స్‌ను కేజ్రీవాల్ ఒప్పుకోడానికి ససేమిరా అంటున్నారు. గుజరాత్‌లో ఆప్‌ కనీసం 8 స్థానాలు గెలుచుకుంటుందని అన్ని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. కానీ...కేజ్రీవాల్ మాత్రం అంతకు మించి వస్తాయన్న ధీమాతో ఉన్నారు. ఫలితాలొచ్చాక...ఈ పోల్స్ అన్నీ తప్పుడు తడకలే అని ప్రజలందరికీ అర్థమవుతుందని చెబుతున్నారు. అంతే కాదు...కనీసం 100 స్థానాల్లో గెలిచి తీరతామని స్పష్టం చేస్తున్నారు. "ఈ ఫలితాలు మాకు తప్పకుండా సానుకూలంగా ఉంటాయి. బీజేపీ కంచుకోట అయిన గుజరాత్‌లో 15-20% మేర మేము ఓట్లు రాబట్టుకోవడం గొప్ప విషయం. కౌంటిగ్‌ డే వరకూ అందరూ వేచి చూడండి" అని అన్నారు కేజ్రీవాల్. 


Also Read: వెలవెలబోతున్న ఢిల్లీ కాంగ్రెస్ ఆఫీస్‌, తాళం వేసి వెళ్లిపోయారు!