Delhi Women Commission Employees: ఢిల్లీలో మరోసారి లెఫ్ట్‌నెంట్ గవర్నర్, ప్రభుత్వానికి మధ్య విభేదాలు బయటపడ్డాయి. ఢిల్లీ మహిళా కమిషన్‌లో ఆప్ నియమించిన 233 మంది ఉద్యోగుల్ని గవర్నర్ తొలగించడం సంచలనమవుతోంది. ఆప్ ఎంపీ స్వాతి మలివాల్ ఢిల్లీ మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్‌గా ఉన్నప్పుడు నిబంధనల్ని పక్కన పెట్టి నియామకాలు జరిపినట్టు ఆరోపణలున్నాయి. ఈ కమిషన్‌లో 40 మంది సభ్యులు ఉండేందుకు మాత్రమే అనుమతి ఉందని, కానీ ఆ సంఖ్యని 233కి పెంచారని లెఫ్ట్‌నెంట్ గవర్నర్ ఇచ్చిన ఉత్తర్వుల్లో ప్రస్తావించారు. తన అనుమతి తీసుకోకుండానే ఈ నియామకాలు జరిగినట్టు అందులో పేర్కొన్నారు. అంతే కాదు. మహిళా కమిషన్‌కి సభ్యుల్ని ఎంపిక చేసుకునే హక్కు లేదని స్పష్టం చేశారు. ఈ నియామకాలు నిబంధనల ప్రకారం జరగలేదని విచారణలో తేలినట్టు గవర్నర్ ఇచ్చిన ఉత్తర్వుల్లో స్పష్టంగా ఉంది. అంతే కాదు. ఇప్పటి వరకూ ఆ ఉద్యోగులకు అలవెన్స్‌లు, జీతాలు ఇవ్వడాన్ని ఎలా సమర్థించుకుంటారో చెప్పాలని ఆదేశించారు లెఫ్ట్‌నెంట్ గవర్నర్ వీకే సక్సేనా.
రాజ్యసభ ఎంపీగా ఎన్నిక కాకముందు స్వాతి మలివాల్ 9 ఏళ్ల పాటు ఢిల్లీ మహిళా కమిషన్ చీఫ్‌గా ఉన్నారు. అప్పటి నుంచి మహిళా కమిషన్ చీఫ్ పోస్ట్ ఖాళీగానే ఉంది. ఆ సమయంలో కమిషన్‌లో తనకు నచ్చిన వాళ్లను ఎంపిక చేసుకునేందుకు పదేపదే ఆమె ఆర్థిక శాఖ అనుమతి తెచ్చుకున్నారని లెఫ్ట్‌నెంట్ గవర్నర్ ఆర్డర్ స్పష్టం చేస్తోంది. అయితే...స్వాతి మలివాల్ ఇప్పటి వరకూ ఈ ఆరోపణలపై స్పందించలేదు. ఇప్పటికే ఆప్ ప్రభుత్వానికి, ఎల్‌జీకి మధ్య విభేదాలు తలెత్తాయి. ఇప్పుడీ వివాదంతో మరోసారి అవి ముదరనున్నాయి. ప్రభుత్వ నిర్ణయాలను లెఫ్ట్‌నెంట్ గవర్నర్ పదేపదే అడ్డుకుంటున్నారని ఆప్ చాలా సందర్భాల్లో ఆరోపించింది. ఆయన బీజేపీ చేతుల్లో కీలుబొమ్మగా పని చేస్తున్నారని మండి పడింది. ప్రస్తుతం ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ లిక్కర్ స్కామ్‌లో అరెస్ట్ అయి తీహర్‌లో జైల్లో ఉన్నారు. ఇలాంటి సమయంలో ప్రభుత్వంపై ఈ తరహా ఆరోపణలు రావడం సంచలనమవుతోంది.
అయితే..ఈ ఆరోపణలపై స్వాతి మలివాల్ స్పందించారు. 8 ఏళ్లలో ఢిల్లీ మహిళా కమిషన్ మహిళల కోసం ఎంతో చేసిందని వెల్లడించారు. లక్షా 70 వేల కేసులపై విచారణ జరిపినట్టు వివరించారు. లైంగికంగా వేధింపులకు గురైన మహిళలకు భరోసా ఇచ్చినట్టు చెప్పారు.
Also Read: UAE Rains: యూఏఈలో మరోసారి భారీ వర్షాలు, నీట మునిగిన దుబాయ్ అబుదాబి - ఫ్లైట్‌లు రద్దు