ఢిల్లీ నూతన పోలీస్‌ కమిషనర్‌ నియామకంపై రాష్ట్ర ప్రభుత్వం తమ అసంతృప్తి వ్యక్తం చేసింది. ఢిల్లీ పోలీస్ కమిషనర్‌గా గుజరాత్‌ కేడర్‌కు చెందిన రాకేశ్‌ ఆస్తానా నియామకంపై ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ప్రభుత్వం అసెంబ్లీలో ఓ తీర్మానం చేసింది. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ రాకేష్ ఆస్తానా నియామకం నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని తీర్మానం చేశారు. కొద్ది రోజుల్లో పదవీ విరమణ కానున్న ఐపీఎస్ అధికారిని ఢిల్లీ పోలీస్ బాస్‌గా నియమించడంపై ఆప్ ప్రభుత్వం అసంతృప్తి వ్యక్తం చేసింది. వాస్తవానికి ఆయన జులై 31న రిటైర్మెంట్ కావాల్సి ఉంది.


గుజరాత్ కేడర్‌కు చెందిన ఐపీఎస్ అధికారి రాకేష్ ఆస్తానాను ఢిల్లీ పోలీస్ కమిషనర్‌గా మంగళవారం నియమితులయ్యారు. మరో మూడు రోజుల్లో రిటైర్మెంట్ కానున్న ఆస్తానాకు ఢిల్లీ పోలీస్ బాస్‌గా బాధ్యతలు అప్పగించడాన్ని ఆప్ ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఇంటర్ క్యాడర్ డెప్యూటేషన్ కింద గుజరాత్ క్యాడర్ నుంచి ఏజీఎంయూటీకి ఈ సీనియర్ ఐపీఎస్ అధికారిని బదిలీ చేస్తూ కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకుంది. రిటైర్మెంట్ కానున్న రాకేష్ ఆస్తానా పదవీ కాలాన్ని మరో ఏడాది పాటు పొడిగిస్తున్నట్లు హోం శాఖ ఉత్తర్వులలో పేర్కొంది.


రాకేష్ ఆస్తానాకు ఢిల్లీ శాంతిభద్రతలు అప్పగించడాన్ని ఆమ్ ఆద్మీ పార్టీ సర్కార్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది.  సుప్రీంకోర్టు నియమాలు, నిర్ణయాలు ఉల్లంఘిస్తున్నారని కేంద్రం ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆప్ సీనియర్ నేత సత్యేందర్ జైన్ మాట్లాడుతూ.. నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం (బీజేపీ) గత ఏడేళ్లుగా ఢిల్లీకి అంతగా అవసరం లేని పోలీస్ కమిషనర్లను నియిమించింది, కానీ ఏడేళ్లలో తొలిసారిగా ఓ సమర్థుడైన అధికారిని నియమించారని సత్యేందర్ జైర్ చెప్పారు. సుప్రీంకోర్టు సూచన ప్రకారం.. ఆరు నెలల్లో పదవీకాలం పూర్తి చేసుకునే వారికి డీజీ స్థాయి అధికారికిగా నియమించకూడదన్నారు. అయితే రాకేష్ ఆస్తానా కేవలం నాలుగు రోజుల్లోనే రిటైర్మెంట్ కానుండగా, ఆయనకు బాధ్యతలు ఎలా అప్పగిస్తారని ఢిల్లీ మంత్రి సత్యేందర్ జైన్ ప్రశ్నించారు.


కాంగ్రెస్ పార్టీ నేతలు సైతం ఢిల్లీ పోలీస్ కమిషనర్‌గా రాకేష్ ఆస్తానా నియామకాన్ని తప్పుపట్టింది. ఇది కేవలం అంతర్ రాష్ట్రాల అధికారుల బదిలీ అంశం కాదని, దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు నిర్ణయాలు ఉల్లంఘించారని కాంగ్రెస్ సీనియర్ నేత పవన్ ఖేరా అన్నారు. పదవీ విరమణ నేపథ్యంలో ఆస్తానాను సీబీఐ డైరెక్టర్‌గా నియమించలేకపోయారని గుర్తుచేశారు. సీబీఐ డైరెక్టర్ నియామకంపై ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన నిర్వహించిన ఓ సమావేశంలో.. మరో 6 నెలల్లో రిటైర్మెంట్ కానున్న వారిని పోలీసు ఉన్నతాధికారులుగా నియమించడం సరైన నిర్ణయం కాదని సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలను చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ గుర్తుచేయడం తెలిసిందే.