Aravind Kejriwal : ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఎట్టకేలకు సుప్రీంకోర్టు నుంచి బెయిల్ పొంది జైలు నుంచి బయటకు వచ్చారు. మనీష్ సిసోడియా, సంజయ్ సింగ్ సహా ఆమ్ ఆద్మీ పార్టీ పెద్ద నాయకులు ఆయనకు స్వాగతం పలికారు. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆప్ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ..  తాను నిజాయితీపరుడనని.. అందుకే దేవుడు తనకు మద్దతు ఇచ్చాడని అన్నారు. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత నా బలం 100 రెట్లు పెరిగిందన్నారు.


దేవుడు నా వెంటే ఉన్నాడు : కేజ్రీవాల్
అరవింద్ కేజ్రీవాల్ మాట్లాడుతూ..‘‘ మిత్రులారా, నా జీవితం దేశానికే అంకితం. నా జీవితంలోని ప్రతి క్షణం, ప్రతి రక్తపు చుక్క దేశం కోసం త్యాగం చేస్తాను. జీవితంలో చాలా కష్టపడ్డాను. భారీ పోరాటాలు చేశాను. జీవితంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కానీ దేవుడు నన్ను అడుగడుగునా ఆదరించాడు. నేను సత్యవంతుడు కాబట్టి దేవుడు నన్ను ఆదరించాడు. ఇదే నిజం. కాబట్టి దేవుడు నన్ను కాపాడాడు. నా కోసం దేవాలయాలు, మసీదులు, గురుద్వారాలలో ప్రార్థనలు చేసిన వారందరికీ ధన్యవాదాలు. బీజేపీ  జైలులో నా ధైర్యాన్ని విచ్ఛిన్నం చేయలేకపోయింది.’’ అని తెలిపారు






100రెట్లు పెరిగింది
ఇంకా ఆయన మాట్లాడుతూ.. ‘ఈరోజు నేను జైలు నుంచి బయటకు వచ్చాను. నా ధైర్యం వంద రెట్లు పెరిగింది. నా బలం వంద రెట్లు పెరిగింది. వారి జైలులోని మందపాటి గోడలు కేజ్రీవాల్ ధైర్యాన్ని బలహీనపరచలేవు. ఈ రోజు వరకు దేవుడు నాకు మార్గాన్ని చూపినట్లే, భవిష్యత్తులో కూడా నాకు సరైన మార్గం చూపాలని నేను దేవుడిని ప్రార్థిస్తున్నాను. దేశానికి సేవ చేస్తూనే ఉంటాను’ అని అన్నారు. దేశాభివృద్ధిని అడ్డుకుంటున్న దేశ వ్యతిరేక శక్తులు, దేశాన్ని విభజించేందుకు ప్రయత్నిస్తున్నాయి, దేశాన్ని నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నిస్తున్నాయి. నా జీవితమంతా వారిపై పోరాడాను. భవిష్యత్తులో కూడా ఇలాగే పోరాడుతూనే ఉంటానని అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. 



ఆర్నెల్ల తర్వాత బయటకు
ఢిల్లీ లిక్కర్ స్కామ్ వ్యవహారంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ అరెస్ట్ అయ్యారు. ఈ రోజు సీబీఐ కేసుపై సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది.  దీంతో దాదాపు ఆరు నెలల తర్వాత ఆయన జైలు నుంచి శుక్రవారం సాయంత్రం రిలీజ్ అయ్యారు. మార్చి 21న కేజ్రీవాల్‌ను ఈడీ అరెస్ట్ చేసింది. పది రోజుల విచారణ అనంతరం ఏప్రిల్ 1న తీహార్ జైలుకు తరలించారు. సార్వత్రిక ఎన్నికల ప్రచారం కోసం మే 10న 21 రోజుల పాటు బెయిల్ పై విడుదలయ్యారు. మరో 51 రోజుల పాటు తర్వాత జైలు నుంచి ఇప్పుడే విడుదలయ్యారు. కేజ్రీవాల్  177 రోజులు జైలులో గడిపారు. ఎన్నికల సందర్భంగా 21 రోజులను తగ్గిస్తే.. కేజ్రీవాల్ మొత్తం 156 రోజులు జైలులోనే ఉన్నట్లు.  సీఎంకు బెయిల్ మంజూరు చేసిన న్యాయస్థానం... కేజ్రీవాల్ అరెస్టు అక్రమం కాదని ఈ సందర్భంగా సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది.  అయితే, నేరం రుజువు కాకుండా న్యాయ ప్రక్రియలో సుదీర్ఘ కాలం పాటు జైలులో ఉంచడం అంటే వ్యక్తి స్వేచ్ఛను హరించినట్లేనని బెయిల్ మంజూరు చేసిన న్యాయమూర్తి జస్టిస్ భుయాన్ అన్నారు.