Cyberabad Commissioner Released Annual Crime Report: ఎమ్మెల్యేల కొనుగోలుకు సంబంధించిన కేసులో విచారణ కొనసాగుతోందని సైబరాబాద్ (Cyberabad) సీపీ అవినాష్ మహంతి (Avinash Mahanthi) తెలిపారు. త్వరలోనే ఈ కేసుపై అన్ని వివరాలు అందిస్తామని వెల్లడించారు. శనివారం సైబరాబాద్ కు సంబంధించి వార్షిక నేర నివేదికను విడుదల చేశారు. కమిషనరేట్ పరిధిలో గతేడాదితో పోలిస్తే ఈసారి సైబర్ క్రైమ్ కేసులు పెరిగాయని చెప్పారు. అలాగే, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ (Srinivas Goud)పై హత్యాయత్నం కేసులో సైతం దర్యాప్తు కొనసాగుతోందని పేర్కొన్నారు.
పెరిగిన సైబర్ నేరాలు
సైబరాబాద్ పరిధిలో శాంతి భద్రతల పరిరక్షణకు మరింత పకడ్బందీగా పని చేస్తామని సీపీ పేర్కొన్నారు. ఆర్థిక, స్థిరాస్తి నేరాలు ఎక్కువగా నమోదవుతున్నాయని, బాధితులకు సత్వర న్యాయం చేసేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా కమిషనరేట్ సిబ్బంది 2 నెలలు సమర్థంగా పని చేశారని అన్నారు. 'గతేడాది సైబర్ క్రైమ్ కేసులు 4,850 ఉంటే, ఈసారి 5,342 కేసులు నమోదయ్యాయి. ఈ ఏడాది రూ.232 కోట్ల మోసం జరిగింది. 2023లో 277 డ్రగ్స్ కేసులు నమోదు కాగా, 567 మందిని అరెస్ట్ చేశాం. రూ.27.82 కోట్ల విలువైన డ్రగ్స్ సీజ్ చేశాం.' అని పేర్కొన్నారు.
2023లో రెండు పీడీ యాక్ట్ కేసులు నమోదు చేశామని సీపీ మహంతి పేర్కొన్నారు. ఈ ఏడాది మహిళలపై నేరాలు తగ్గాయన్నారు. 2022లో 316 అత్యాచారం కేసులు నమోదైతే, ఈసారి 259 కేసులు నమోదయ్యాయని చెప్పారు. గతేడాది పోలిస్తే మోసాల కేసులు పెరిగాయని, 2022లో 6,276 కేసులు రాగా, ఈ ఏడాది 6,777 కేసులు నమోదయ్యాయని తెలిపారు. సైబరాబాద్ పరిధిలో రోడ్డు ప్రమాదాలు, హత్యలు, దోపిడీ, చోరీ కేసులు కూడా పెరిగాయని వెల్లడించారు. 2022లో 93 హత్య కేసులు వస్తే ప్రస్తుతం 105 హత్య కేసులు నమోదైనట్లు ప్రకటించారు. ఈ ఏడాది 52,124 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదైతే, వాటిలో 1,271 మందికి శిక్షలు పడ్డాయని చెప్పారు.
నివేదికలో ముఖ్యాంశాలు
కేసులు | 2022 | 2023 |
మహిళలపై నేరాలు | 2,489 | 2,356 |
మోసాల కేసులు | 6,276 | 6,777 |
హత్య కేసులు | 93 | 105 |
మొత్తం నమోదైన కేసులు | 4,850 | 5,342 |
డ్రంక్ అండ్ డ్రైవ్ | 52,124 | |
డ్రగ్స్ కేసులు | 277 |
వారికి హెచ్చరిక
ప్రతి అధికారిపై పర్యవేక్షణ ఉంటుందని, సిఫార్సు లేఖలపై పోస్టింగులు ఉండవని సీపీ అవినాష్ మహంతి స్పష్టం చేశారు. అలాగే, నూతన సంవత్సర వేడుకలు నిర్వహించే వారు తప్పనిసరిగా ముందస్తు అనుమతి తీసుకోవాలని అన్నారు. లేకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా తాగి వాహనాలు నడిపినా కఠిన చర్యలు తప్పవన్నారు.