Ambati Rayudu Pawan Kalyan meet: క్రికెటర్ అంబటి రాయుడు నేడు (జనవరి 10) పవన్ కల్యాణ్ ను కలిసిన అనంతరం ఆసక్తికర పోస్ట్ చేశారు. వైఎస్ఆర్ సీపీతో (YSRCP) కలిసి రాజకీయాల్లో అడుగులు వేస్తే తాను అనుకున్న లక్ష్యాలను సాధించలేనని తనకు అర్థమైందని అన్నారు. నా ఆలోచనలు, కలలు సాకారమవుతాయని వైఎస్ఆర్ సీపీలో చేరానని.. కానీ తన భావజాలం వైఎస్ఆర్ సీపీ భావజాలం వేర్వేరు అని ఆలస్యంగా తెలుసుకున్నానని అన్నారు. తన శ్రేయోభిలాషులు చెప్పిన ప్రకారం.. తాను జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను కలిసినట్లు ఎక్స్‌లో చేసిన పోస్ట్ లో పేర్కొన్నారు.


‘‘స్వచ్ఛమైన ఆలోచనలు, మనసుతో ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతోనే రాజకీయాల్లోకి ప్రవేశించాను. అలా నా కలలు, ఆలోచనలు నెరవేరుతాయని వైఎస్ఆర్ సీపీలో చేరాను. అలా ఎన్నో ఊర్లు, ప్రాంతాలు పర్యటించాను. ఎంతో మంది ప్రజలను కలిశాను. క్షేత్ర స్థాయిలో ప్రజల సమస్యలను కళ్లారా చూశాను. వారికి నాకు సాధ్యమైనంత వరకూ సాయం చేశాను. ఆ తర్వాతే వైఎస్ఆర్ సీపీలో చేరాను. కానీ, వైఎస్ఆర్ సీపీతో కలిసి ముందుకెళ్తే నేను అనుకున్న లక్ష్యాలను సాధించలేనని ఆ తర్వాతే అర్థమైంది. ఈ విషయంలో నేను ఎవరినీ తప్పుబట్టట్లేదు. నా ఆలోచన, వైసీపీ భావజాలం వేర్వేరుగా ఉన్నాయి. ఎన్నికల్లో ఫలానా స్థానం నుంచి పోటీ చేయాలని నేను అనుకోలేదు. 


ఇకపై మరికొంత కాలం రాజకీయాలకు దూరంగా ఉండాలని అనుకున్నా. అయితే, ఆ నిర్ణయం తీసుకునే ముందు ఓసారి పవన్‌ కల్యాణ్ అన్నను కలవమని నా స్నేహితులు, శ్రేయోభిలాషులు సలహా ఇచ్చారు. ఆయన భావజాలం గురించి తెలుసుకోమన్నారు. అందుకే పవన్‌ కల్యాణ్ ను కలసి మాట్లాడా. జీవితం, రాజకీయాలతో పాటు ఆయన్ను అర్థం చేసుకొనేందుకు ప్రయత్నించా. మా ఇద్దరి ఆలోచనల్లో సారూప్యత కనిపించింది. ఆయన్ను కలిసినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇంటర్నేషనల్‌ క్రికెట్‌ లీగ్‌ కోసం నేను త్వరలోనే దుబాయ్‌ వెళ్తున్నా. నేను ఎక్కడ ఉన్నా ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు అండగా ఉంటా’’ అని పోస్ట్‌లో పేర్కొన్నారు.