IAS Officer Puja Khedkar వివాదాస్పద ట్రెయినీ ఐఏఎస్ అధికారి పూజా ఖేద్కర్‌కు అరెస్టు నుంచి భారీ ఊరట లభించింది. ఆమెను తక్షణం అరెస్టు చేయాల్సిన అవసరం కనిపించడం లేదంటూ ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సుబ్రమణియం ప్రసాద్ అన్నారు. ఆమెను ఆగస్టు 21 వరకు అరెస్టు చేయవద్దని ఢిల్లీ హైకోర్టు పోలీసులను ఆదేశించింది.
ప్రతిష్టాత్మకమైన సివిల్ సర్వీసెస్ పరీక్షలను నిర్వహించే యూపీఎస్సీ, పూజా ఖేద్కర్‌పై ఎఫ్‌ఐఆర్ దాఖలు చేసింది. తప్పుడు ధ్రువపత్రాలు సమర్పించి ఆమె ఉద్యోగం సంపాదించిందని ఆరోపించింది. మొత్తం కుట్రను వెలికితీయడానికి, కుట్రలో ప్రమేయం ఉన్న ఇతర వ్యక్తుల ప్రమేయాన్ని నిర్ధారించడానికి నిందితులను కస్టోడియల్ ఇంటరాగేషన్ అవసరమని ట్రయల్ కోర్టు న్యాయమూర్తి వాదించారు. కేసుకు సంబంధించి ఆమె నుంచి మరిన్ని వివరాలు రాబట్టేందుకు ఆమెను అదుపులోకి తీసుకుని విచారించాలని ఢిల్లీ పోలీసులు నిర్ణయించారు.
ఈ సందర్భంగా ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సుబ్రమణియం ప్రసాద్ మాట్లాడుతూ “ప్రస్తుతానికి, ఆమెకు తక్షణ కస్టడీ అవసరమని కనిపించడం లేదు. అయితే బెయిల్ ఎందుకు మంజూరు చేయాలి లేదా ఎందుకు మంజూరు చేయకూడదు, ” అని జస్టిస్ ప్రసాద్ యూపీఎస్సీ తరఫున హాజరైన సీనియర్ న్యాయవాది నరేష్ కౌశిక్‌తో అన్నారు. ప్రస్తుతం కేసు నడుస్తున్న తీరు పట్ల సంతృప్తి వ్యక్తం చేసిన ఆయన, తదుపరి విచారణ ఆగస్టు 21వ తేదీ వరకు పిటిషనర్‌ను అరెస్టు చేయాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. ఆమెను తక్షణం అరెస్టు చేయాల్సిన అవసరం ఏముందో స్పష్టం చేయాలంటూ ఢిల్లీ పోలీసులకు, యూపీఎస్సీకి కోర్టు నోటీసులు జారీ చేసింది.
ఇటీవలే ఆమెను యూపీఎస్సీ పరీక్షల్లో తప్పుడు పత్రాలు సమర్పించి ఉద్యోగం సంపాదించిందన్న ఆరోపణలు ఎదుర్కొంటూ ఉద్యోగం నుంచి సస్పెన్షన్ కు గురైన సంగతి తెలిసిందే. రిజర్వేషన్ ప్రయోజనాలను పొందడానికి UPSC నిర్వహించే సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ 2022 కోసం, పూజ ఖేద్కర్ తన దరఖాస్తులో తప్పుడు సమాచారం అందించారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ ఆరోపణల నేపథ్యంలో ప్రాథమిక ఆధారాలతో జూలై 31న, UPSC ఖేద్కర్ అభ్యర్థిత్వాన్ని రద్దు చేయడంతోపాటు ఆమె భవిష్యత్తులోనూ మరే పరీక్షలు రాయకుండా డీబార్ చేసింది. అయితే ఆమె అభ్యర్థిత్వాన్ని రద్దు చేయడాన్ని సవాలు చేయడానికి తగిన ఫోరమ్‌ను ఆశ్రయించే స్వేచ్ఛను ఆమెకు ఢిల్లీ హైకోర్టు ఇచ్చింది.
దేశవ్యాప్తంగా సంచలనం
2023 IAS బ్యాచ్ కు చెందిన ఖేద్కర్, ఆమె పేరు, ఆమె తండ్రి, తల్లి పేర్లు, ఆమె ఫోటో, సంతకం, ఈమెయిల్ ID, మొబైల్ నంబర్, చిరునామాతో సహా ఆమె అన్ని వివరాలకు సంబంధించి తప్పుడు ధ్రువ పత్రాలను సమర్పించి IAS కు ఎంపికయ్యారని ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఇది దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ కేసు విచారణ జరుగుతుండగానే యూపీఎస్సీ చైర్మన్ తన పదవీకాలం ముగియకుండానే రాజీనామా సమర్పించారు. దీనిపై మరిన్ని అనుమానాలు వ్యక్తమయ్యాయి. దీనిపై సీనియర్ IAS అధికారి స్మితా సబర్వాల్ సైతం స్పందించారు. ఇప్పుడు ఉద్యోగంలో ఉన్న అందరు IAS ల ధ్రువపత్రాలు పరిశీలించాలని డిమాండ్ చేశారు. అలా చేస్తే ఇంకెంతమంది ఇలాంటి చర్యలకు పాల్పడి ఉంటారో తెలుస్తుందని ట్వీట్ చేశారు. కష్టపడి ఉద్యోగం సంపాదించిన నిజాయితీపరులైన ఉద్యోగులు స్వచ్ఛందంగా ముందుకొస్తారని ఆమె పేర్కొన్నారు.