Covid 19 Cases in India:


పెరుగుతున్న కేసులు..


భారత్‌లో కొవిడ్ కొత్త వేరియంట్ (Covid Cases in India) చాలా వేగంగా వ్యాప్తి చెందుతోంది. క్రమంగా బాధితుల సంఖ్య పెరుగుతోంది. ఆసుపత్రుల్లో చేరుతున్న వారి సంఖ్య తక్కువగానే ఉన్నప్పటికీ కేసులు పెరగడమే ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటి వరకూ 109 మందికి కొవిడ్ కొత్త వేరియంట్ JN.1 సోకినట్టు విశ్వసనీయ వర్గాలు (JN.1 Cases in India) వెల్లడించాయి. గుజరాత్‌లో 36 మంది బాధితులున్నారు. కర్ణాటకలో 34, గోవాలో 14, మహారాష్ట్రలో 9, కేరళలో 6, రాజస్థాన్‌లో నాలుగు, తమిళనాడులో నాలుగు, తెలంగాణలో రెండు కేసులు నమోదయ్యాయి. INSACOG ఇప్పటికే కొన్ని కొవిడ్ శాంపిల్స్‌ని జీనోమ్ సీక్వెన్సింగ్ చేస్తోంది. అటు కేరళలో కొవిడ్ వేగంగా వ్యాపిస్తోంది. గత 24 గంటల్లోనే కేరళలో 409 కరోనా కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతానికి దేశవ్యాప్తంగా 4,093 యాక్టివ్ కేసులుండగా అందులో 3 వేలకి పైగా కేసులు కేరళలోనే నమోదయ్యాయి. కేంద్ర ఆరోగ్య శాఖ లెక్కల ప్రకారం కర్ణాటకలో మొత్తం 122 కరోనా కేసులు నమోదు కాగా ముగ్గురు కొవిడ్ కారణంగా ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటికే రకరకాల వ్యాధులతో సతమతం అవుతున్న వారికి ఈ వైరస్ చాలా వేగంగా సోకుతోందని వైద్యులు చెబుతున్నారు. మొత్తంగా JN.1 వేరియంట్ 7 రాష్ట్రాల్లో వ్యాప్తి చెందిందని స్పష్టం చేశారు. కర్ణాటక, గోవా, కేరళ, మహారాష్ట్ర, తెలంగాణ, రాజస్థాన్, తమిళనాడులో కేసులు నమోదయ్యాయి. ఇప్పటికే వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతోందని...ఇక క్రిస్మస్‌, న్యూ ఇయర్ వేడుకల కారణంగా ఇది మరింత పెరిగే ప్రమాదముందని అంచనా వేస్తున్నారు. ఇదే జరిగితే వచ్చే ఏడాది మొదటి రెండు వారాల్లోనే కేసుల సంఖ్య అనూహ్యంగా పెరిగే అవకాశముంది. దేశవ్యాప్తంగా 21 రాష్ట్రాల్లో ప్రస్తుతం కరోనా కేసులు నమోదవుతున్నాయి.