Surat lenscart: గుజరాత్‌లోని సూరత్ నగరంలో ప్రముఖ ఐవేర్ బ్రాండ్ లెన్స్‌కార్ట్ (Lenskart) చుట్టూ ఇప్పుడు పెద్ద ఎత్తున వివాదం చెలరేగుతోంది. ఒక హిందూ ఉద్యోగి తన మతపరమైన చిహ్నాలను ధరించినందుకు కంపెనీ అతనిని పనిలో నుండి తొలగించిందన్న ఆరోపణలు రావడంతో హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. జీల్ వఘాసియా అనే యువకుడు ట్రైనింగ్ సమయంలో తన మత విశ్వాసాలకు గుర్తులైన శిఖ , తిలకం , జంధ్యం ధరించాడని, కంపెనీ యాజమాన్యం వీటిని తొలగించాలని ఆదేశించిందని ఆరోపించాడు. దీనికి అతను నిరాకరించడంతో, అతనిని తక్షణమే ఉద్యోగం నుండి తొలగించారని ప్రచారం జరుగుతోంది.
ఈ ఘటనపై తీవ్రంగా స్పందించిన హిందూ ధార్మిక సంస్థలు సూరత్ వీధుల్లో భారీ నిరసన ప్రదర్శనలు చేపట్టాయి. నగరంలోని ఒక లెన్స్‌కార్ట్ షోరూమ్ ఎదుట ఆందోళనకారులు బైఠాయించి, కంపెనీ వైఖరికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా కంపెనీ దిష్టిబొమ్మను దహనం చేసి తమ నిరసనను తెలియజేశారు. ఇతర మతాలకు చెందిన చిహ్నాలను అనుమతిస్తూ, కేవలం హిందూ ధర్మ చిహ్నాలపైనే వివక్ష చూపడం రాజ్యాంగ విరుద్ధమని వారు మండిపడుతున్నారు. మతపరమైన మనోభావాలను దెబ్బతీసే ఇలాంటి ధోరణులను సహించబోమని హెచ్చరించారు.
బాధితుడు జీల్ వఘాసియా కూడా ఇవే ఆరోపణలు చేస్తున్నారు. నా వృత్తి కంటే నా ధర్మమే నాకు ముఖ్యం. ధర్మం కోసం ఉద్యోగాన్ని వదులుకోవడానికైనా సిద్ధమే తప్ప, నా విశ్వాసాలను వదులుకోను అని చెబుతున్నారు. ఈ క్రమంలో గుజరాత్ కుచెందిన పలువురు హిందూ ప్రముఖులు కూడా రంగంలోకి దిగి, కంపెనీ తన విధానాలను మార్చుకోకపోతే ఈ నిరసనలు కేవలం సూరత్‌కే పరిమితం కాకుండా దేశవ్యాప్తంగా వ్యాపిస్తాయని హెచ్చరికలు జారీ చేశారు. ఉద్యోగుల వ్యక్తిగత విశ్వాసాలను గౌరవించాల్సిన బాధ్యత కార్పొరేట్ సంస్థలపై ఉందని వారు పేర్కొంటున్నారు.
ప్రస్తుతం ఈ వివాదం సోషల్ మీడియాలో కూడా వైరల్‌గా మారింది. నెటిజన్లు లెన్స్‌కార్ట్‌ను ఉద్దేశించి రకరకాల కామెంట్లు చేస్తున్నారు. అయితే ఈ ఘటనపై లెన్స్‌కార్ట్ అధికారికంగా ఇంకా పూర్తిస్థాయి స్పష్టత ఇవ్వాల్సి ఉంది. సాధారణంగా కార్పొరేట్ సంస్థలకు డ్రెస్ కోడ్ నిబంధనలు ఉన్నప్పటికీ, అవి మతపరమైన స్వేచ్ఛను హరించేలా ఉండకూడదని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. లెన్స్‌కార్ట్ సంస్థ ఇటీవల ఇలాంటి మతపరమైన అంశాల్లోనే వివాదాస్పదమయింది. ఆ వివాదంతో ఇన్-స్టోర్ స్టైల్ గైడ్ ను సమూలంగా మార్చేసింది. కొత్త నిబంధనల ప్రకారం.. ఉద్యోగులు తమ మతపరమైన , సంస్కృతికి సంబంధించిన చిహ్నాలను ధరించేందుకు స్పష్టమైన అనుమతిని ఇచ్చింది. బిందీ, తిలకం, సింధూరం, , మంగళసూత్రం, కడా, హిజాబ్ , టర్బన్ వంటి వాటన్నింటినీ గౌరవిస్తామని, ఇవి ఎవరికీ మినహాయింపులు కావని, ఇవి మన భారతీయ మూలాల్లో భాగమని కంపెనీ తన ప్రకటనలో పేర్కొంది. ఇప్పుడు తాజాగా సూరత్‌లో చోటుచేసుకున్న మతపరమైన చిహ్నాల వివాదం, పాత వివాదాలను మరోసారి గుర్తుచేస్తూ కంపెనీ బ్రాండ్ ఇమేజ్‌పై ప్రభావం చూపుతోంది.
