Congress is heavily criticizing the India US trade deal: అమెరికాతో కుదిరిన వాణిజ్య ఒప్పందంపై కాంగ్రెస్ పార్టీ తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. ఈ ఒప్పందాన్ని ట్రంప్-నిర్భరత అని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ అభివర్ణించారు. దేశానికి సంబంధించిన కీలక నిర్ణయాలను భారత ప్రభుత్వం కంటే ముందుగా అమెరికా ప్రతినిధులు, అధ్యక్షుడు ట్రంప్ తన ట్రూత్ సోష వేదికగా వెల్లడించడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ దేశాన్ని అమెరికాకు తాకట్టు పెట్టారు, ఇది భారత్‌కు అత్యంత తక్కువ స్థాయి క్షణం అంటూ కాంగ్రెస్ కేరళ విభాగం తీవ్ర వ్యాఖ్యలు చేసింది.
లోక్‌సభ వెలుపల మీడియాతో మాట్లాడిన రాహుల్ గాంధీ, ప్రధాని మోదీ తీవ్ర ఒత్తిడిలో ఉన్నారని ఆరోపించారు. మోదీజీ భయపడుతున్నారు. తన ఇమేజ్ కాపాడుకోవడం కోసం దేశ ప్రయోజనాలను పక్కనపెట్టి రాత్రికి రాత్రే ఈ ఒప్పందంపై సంతకం చేశారు అని విమర్శించారు. ఎప్ స్టీన్ ఫైల్స్ తో పాటు అదానిపై కేసు విషయంలో మోదీ భయపడుతున్నారని రాహుల్ ఆరోపించారు. సభలో చైనా అంశాన్ని లేవనెత్తకుండా అధికార పక్షం తన గొంతు నొక్కుతోందని, దేశాన్ని అమెరికా కాలనీగా మారుస్తున్నారని ఆయన మండిపడ్డారు.
విపక్షాల విమర్శలను కేంద్ర మంత్రి పీయూష్ గోయల్, ఇతర నేతలు కొట్టిపారేశారు. ఈ ఒప్పందం మేడ్ ఇన్ ఇండియా ఉత్పత్తులకు గ్లోబల్ మార్కెట్‌ను తెరుస్తుందని, అమెరికా దిగుమతి సుంకాలను 25 నుంచి 18 శాతానికి తగ్గించడం గొప్ప విజయమని పేర్కొన్నారు. దేశ రైతుల ప్రయోజనాలను తాము ఎట్టిపరిస్థితుల్లోనూ విస్మరించలేదని, వివాదాస్పద దేశాల నుంచి చమురు కొనుగోళ్లు నిలిపివేసి, అమెరికా వంటి మిత్ర దేశాల నుంచి ఇంధనాన్ని సేకరించడం వ్యూహాత్మక నిర్ణయమని కేంద్రం స్పష్టం చేసింది.
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ ఒప్పందం భారతీయ తయారీదారులకు, ముఖ్యంగా ఎంఎస్ఎంఈ రంగానికి వరమని పేర్కొన్నారు. బడ్జెట్‌లో ప్రకటించిన కస్టమ్స్ డ్యూటీ తగ్గింపులకు, అమెరికా ఒప్పందానికి సంబంధం లేదని, అవన్నీ స్వదేశీ పరిశ్రమల ప్రయోజనాల కోసమే చేశామని ఆమె స్పష్టం చేశారు. ఒప్పందం పూర్తి వివరాలను త్వరలోనే సభ ముందు ఉంచుతామని ఎన్డీయే నేతలు ప్రకటించారు.
