Navjot Singh Sidhu Release:
పార్కింగ్ కేసులో శిక్ష
కాంగ్రెస్ నేత నవజోత్ సింగ్ సిద్దు జైలు నుంచి విడుదల కానున్నారు. దాదాపు 10 నెలలుగా పటియాలా సెంట్రల్ జైల్లో శిక్ష అనుభవిస్తున్నారు. 1988లో కార్ పార్కింగ్ విషయంలో ఓ వ్యక్తితో గొడవపడ్డారు నవజోత్. విచక్షణా రహితంగా ఆ వ్యక్తిని చితకబాదారు. ఫలితంగా ఆ వ్యక్తి ప్రాణాలు కోల్పోయారు. బాధిత కుటుంబం కోర్టుని ఆశ్రయించింది. నవజోత్ కొట్టడం వల్లే అతడు చనిపోయాడని వాదించింది. సాక్ష్యులనూ కోర్టులో హాజరు పరిచింది. ఈ కేసుపై విచారణ జరిపిన సుప్రీం కోర్టు...ఇది సాధారణమైన నేరమే అని తేల్చి చెప్పింది. కేవలం జరిమానాతో సరిపెట్టింది. దీనిపై అసహనం వ్యక్తం చేసిన బాధిత కుటుంబం మరోసారి తీర్పుని సమీక్షించాలని కోరింది. ఆ తరవాత పూర్తి స్థాయి విచారణ చేపట్టి...ఈ నేరానికి కచ్చితంగా శిక్ష పడాల్సిందేనని తేల్చి చెప్పింది. ఏడాది పాటు జైలు శిక్ష విధిస్తున్నట్టు తీర్పునిచ్చింది. ఈ తీర్పు ఆధారంగా..గతేడాది మే 20న పోలీసులు నవజోత్ సింగ్‌ను అరెస్ట్ చేశారు. దీనిపై అధికారిక వివరాలు తెలిసిన తరవాత నవజోత్ సింద్ సిద్దు ట్విటర్ అకౌంట్‌లో ట్వీట్ చేశారు. నవజోత్ విడుదలవుతున్నట్టు ఖరారు చేస్తూ పోస్ట్ చేశారు. అంతకు ముందు పంజాబ్‌లో కాంగ్రెస్ అధికారంలో ఉంది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఆప్ ఆ అధికారాన్ని దక్కించుకుంది. ఇలాంటి కీలక తరుణంలో నవజోత్ విడుదలవుతుండటం ఆసక్తికరంగా మారింది. నిజానికి నవజోత్‌కు ఇంకా రెండు నెలల శిక్ష మిగిలే ఉంది. కానీ...సత్ప్రవర్తన ఆధారంగా ముందే విడుదల చేస్తున్నట్టు జైలు అధికారులు వెల్లడించారు. ఇదే కేసులో 2007లో మూడు రోజుల పాటు జైల్లో ఉన్నారు నవజోత్.
కాంగ్రెస్ నేతల ఏర్పాట్లు
నవజోత్ విడుదల సందర్భంగా కాంగ్రెస్ నేతలు పెద్ద ఎత్తున హడావుడి చేసేందుకు రెడీ అవుతున్నారు. ఘన స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. జైలు నుంచి నేరుగా పటియాలాలోని తన నివాసానికి తీసుకెళ్లనున్నారు. ఈ క్రమంలోనే నవజోత్ భార్య నవజోత్ కౌర్ ట్విటర్‌లో ఎమోషనల్ ట్వీట్‌లు చేశారు. తాను క్యాన్సర్‌తో బాధ పడుతున్నట్టు చెప్పారు. నవజోత్‌కు పంజాబ్‌తో విడదీయలేని బంధం ఉందంటూ పోస్ట్ పెట్టారు. అయితే...విడుదలయ్యి వచ్చాక కాంగ్రెస్‌లో ఆయనకు ఏ పదవి ఇస్తారన్నదీ ఆసక్తికరంగా మారింది. 2002లో అసెంబ్లీ ఎన్నికలు జరిగే సమయానికి పంజాబ్ కాంగ్రెస్ ప్రెసిడెంట్‌గా ఉన్నారు నవజోత్. అయినా...ఆయనను కాదని ఆయన స్థానంలో చరణ్‌జిత్ సింగ్ చన్నీని బరిలోకి దింపింది.