CM Revanth Reddy calls Chandrababu for discussions on issues: తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలే పరమావధిగా, పొరుగు రాష్ట్రాలతో సత్సంబంధాలను కొనసాగిస్తూనే పెండింగ్ సమస్యలను పరిష్కరించుకోవడానికి తాము సిద్ధంగా ఉన్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. రావిర్యాల ఈ-సిటీలో సుజెన్ మెడికేర్ ఫ్లూయిడ్స్ యూనిట్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఆయన, జల వివాదాలు మరియు అంతరాష్ట్ర కనెక్టివిటీపై కీలక వ్యాఖ్యలు చేశారు.
రాజకీయాలొద్దు.. పరిష్కారాలే కావాలి !
తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న జలవివాదాలపై ముఖ్యమంత్రి సూటిగా స్పందించారు. నీళ్ల విషయంలో రాజకీయ లబ్ధిని చూడటం మానుకోవాలి. మాకు పొరుగు రాష్ట్రాలతో పంచాయితీలు పెట్టుకోవడం కంటే సమస్యల పరిష్కారమే ముఖ్యం అని ఆయన అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో మంజూరైన తెలంగాణ ప్రాజెక్టులకు పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి అడ్డుపడవద్దని కోరారు. మీకు పంచాయితీలు కావాలా? నీళ్లు కావాలా? అని ఎవరైనా అడిగితే.. నాకు, నా తెలంగాణకు నీళ్లు మాత్రమే కావాలని చెబుతాను అని ఆయన పేర్కొన్నారు. వివాదాల కంటే శాశ్వత పరిష్కారాలకే మొగ్గు చూపుతామని స్పష్టం చేశారు. కృష్ణా నదిపై తెలంగాణ చేపడుతున్న ప్రాజెక్టుల అనుమతుల కోసం ఏపీ ప్రభుత్వ సహకరించాలని కోరారు.
పోర్టు లేని రాష్ట్రం తెలంగాణనే.. అందుకే మచిలీపట్నం నుంచి హైవే
దేశంలో పోర్టు లేని ఏకైక పెద్ద రాష్ట్రం తెలంగాణ అని గుర్తు చేస్తూ, సముద్ర మార్గంతో అనుసంధానం కావాల్సిన అవసరాన్ని రేవంత్ రెడ్డి వివరించారు. తెలంగాణకు పోర్టు కనెక్టివిటీ పెరగాలంటే ఆంధ్రప్రదేశ్ సహకారం తప్పనిసరి. అందుకే, మచిలీపట్నం పోర్టు నుంచి హైదరాబాద్ సమీపంలోని భారత్ ఫ్యూచర్ సిటీ వరకు ఎక్స్‌ప్రెస్ హైవే నిర్మించాలని మేము కేంద్రాన్ని కోరాము అని వెల్లడించారు. ఈ కనెక్టివిటీ రెండు రాష్ట్రాల ఆర్థికాభివృద్ధికి దోహదపడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.
అమరావతి అభివృద్ధికి హైదరాబాద్ సహకారమూ అవసరమే
నగరాభివృద్ధి అంటే కేవలం ఆకాశహర్మ్యాలు నిర్మించడం మాత్రమే కాదని, ఆ పరిశ్రమలను నడిపించే సమర్థవంతమైన సిబ్బంది కూడా అవసరమని సీఎం అన్నారు. హైదరాబాద్‌లో అటువంటి నైపుణ్యం కలిగిన మానవ వనరులు పుష్కలంగా ఉన్నాయని, అందుకే అంతర్జాతీయ సంస్థలు ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నాయని ఆయన కొనియాడారు. రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధికి ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందని పారిశ్రామికవేత్తలకు భరోసా ఇచ్చారు. అమరావతి అభివృద్ధికి కూడా హైదరాబాద్ సహకారం అవసరమన్నారు.