Xi Jinping Russia Visit:


మార్చి 20-22 మధ్య పర్యటన..


చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ రష్యా పర్యటనకు సిద్ధమవుతున్నారు. వచ్చే వారం ఈ పర్యటన ఉంటుందని చైనా అధికారికంగా ప్రకటించింది. ఉక్రెయిన్‌పై సైనిక చర్య మొదలయ్యాక తొలిసారి జిన్‌పింగ్ రష్యాకు వెళ్లనున్నారు. మార్చి 20 నుంచి 22వ తేదీ వరకూ జిన్‌పింగ్ రష్యాలో పర్యటించనున్నారు. ఇటీవలే మూడోసారి అధ్యక్షుడిగా ఎన్నికైన జిన్‌పింగ్...తొలిసారి విదేశీ పర్యటన చేయనున్నారు. ఉక్రెయిన్‌లో శాంతియుత వాతావరణం ఉండేలా చూడాలంటూ రష్యాతో మాట్లాడే అవకాశాలున్నాయి. రష్యాకు పరోక్షంగా చైనా మద్దతునిస్తోందన్న అపవాదు పోగొట్టుకునేందుకు జిన్‌పింగ్‌ ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. ఇదే సమయంలో రష్యా, చైనా మధ్య మైత్రిని మరింత బలోపేతం చేసేందుకు ఇరు దేశాల అధ్యక్షులు కీలక చర్చలు జరపనున్నట్టు చైనా అధికారులు చెబుతున్నారు. కొన్ని కీలక ఒప్పందాలు కూడా కుదిరే అవకాశాలున్నాయి. గతేడాది ఫిబ్రవరిలో రష్యా అధ్యక్షుడు పుతిన్‌ చైనా పర్యటనకు వచ్చారు. రెండు దేశాల వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్తామని చెప్పారు. ఉక్రెయిన్‌పై సైనిక చర్య మొదలైనప్పటి నుంచి రష్యా, చైనా మధ్య వాణిజ్యం అమాంతం పెరిగింది. రష్యా నుంచి భారీ మొత్తంలో చమురు కొనుగోలు చేస్తోంది డ్రాగన్. ఇదే రష్యాకు భారీ ఆదాయం తెచ్చి పెడుతోంది. అయితే ఈ వాణిజ్యాన్ని మరింత పెంచుకునేందుకు ఇరు దేశాలు ప్రయత్నిస్తున్నాయి.