Qin Gang Death:


క్విన్ గాంగ్ మృతి..? 


చైనా మాజీ విదేశాంగ మంత్రి క్విన్ గాంగ్ మృతి (Qin Gang Dead) చెందినట్టు Politico రిపోర్ట్ వెల్లడించింది. ఆత్మహత్య అయినా చేసుకుని ఉంటాడని, లేదా ఆయనను హింసించి చంపి ఉంటారని తెలిపింది. ఈ ఏడాది జులై నుంచి క్విన్ గాంగ్ కనిపించకుండా పోయారు. అప్పటి నుంచి ఆయన ఏమైపోయారో అని అంతర్జాతీయంగా చర్చ జరుగుతోంది. బీజింగ్‌లోని మిలిటరీ హాస్పిటల్‌లో జులైలోనే ఆయన చనిపోయినట్టు ఇద్దరు ఉన్నతాధికారులు చెప్పినట్టు Politico తెలిపింది. దేశంలోని టాప్ లీడర్స్‌ అందరూ ఈ హాస్పిటల్‌లోనే ట్రీట్‌మెంట్ చేయించుకుంటారు. ఇక్కడే క్విన్ గాంగ్‌ మృతి చెందినట్టు సమాచారం. అయితే...అమెరికాకి దౌత్యవేత్తగా ఉన్న సమయంలో క్విన్ గాంగ్‌ వివాహేతర సంబంధం పెట్టుకున్నారని గతంలో  Wall Street Journal వెల్లడించింది. విచారణకు ఆయన పూర్తి సహకారం అందిస్తున్నారని తెలిపింది. చైనా జాతీయ భద్రతను పణంగా పెట్టి ఆయన ఈ సంబంధం పెట్టుకున్నారా..? అన్న కోణంలో విచారణ జరుపుతున్నట్టు వాల్‌ స్ట్రీట్ జర్నల్ వివరించింది. ఆయన అంబాసిడర్ పదవిలో ఉన్నంత కాలం వివాహేతర సంబంధం కొనసాగించారని తెలిపింది. ఈ సంబంధం కారణంగా ఇద్దరు పిల్లలు కూడా పుట్టినట్టు స్పష్టం చేసింది. 


జూన్‌లో చివరిసారి...


చివరిసారి జూన్ 25న కనిపించారు 57 ఏళ్ల క్విన్. అప్పటి నుంచి మళ్లీ జాడ లేదు. ఏషియన్ సమ్మిట్ హెడ్‌గా ముందుగా క్విన్‌ని నియమించినా ఆ తరవాత తొలగించారు. "అనారోగ్యం వల్లే ఆయన తప్పుకున్నారు" అని చైనా ప్రభుత్వం ప్రచారం చేసినా అది నమ్మశక్యంగా అనిపించడం లేదు. యురోపియన్ యూనియన్‌ ప్రతినిధులతో చర్చలు జరగాల్సి ఉన్నా...వాటినీ కారణం లేకుండానే పోస్ట్‌పోన్ చేసింది చైనా. ఇవన్నీ ఎన్నో అనుమానాలకు తెర తీశాయి. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ ఫిలిప్పైన్స్ మాజీ అధ్యక్షుడితో సమావేశమైనప్పటి నుంచి క్విన్ గాంగ్ మిస్ అయ్యారని ప్రచారం జరుగుతోంది. ఇప్పటి వరకూ ప్రభుత్వం దీనిపై ఎలాంటి ప్రకటన చేయలేదు. పైగా..చైనా సోషల్ మీడియాలోనూ ఈ విషయంపై చర్చించకుండా సెన్సార్ చేసింది ప్రభుత్వం. అక్కడ "where is Qin Gang" అని సోషల్ మీడియాలో సెర్చ్ చేస్తే...సింపుల్‌గా No Results అని చూపిస్తోంది. అంటే ఎంత సీక్రెసీ మెయింటేన్ చేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. సాధారణంగా...చైనాలోని కమ్యూనిస్ట్ పార్టీ ఏ లీడర్ అయినా వివాహేతర సంబంధం పెట్టుకుంటే అసలు సహించదు. వెంటనే ఆ పదవి నుంచి తప్పించేస్తుంది. ఆయన స్థానంలో వాంగ్ యీకి అవకాశమిచ్చింది. 


Also Read: Las Vegas shooting: అమెరికాలో మరో సారి కాల్పుల మోత, ముగ్గురు మృతి