Aam Aadmi Party Status:


రివ్యూ చేస్తున్నాం: రాజీవ్


ఆమ్‌ఆద్మీ పార్టీ జాతీయ పార్టీయా కాదా..? ఈ చర్చ ఎప్పటి నుంచో జరుగుతోంది. గుజరాత్‌లో బీజేపీపై పోటీ చేసి ఓడిపోయినప్పటికీ...జాతీయ పార్టీ అనిపించుకోడానికి కావాల్సిన ఓటుశాతాన్ని మాత్రం రాబట్టుకోగలిగింది ఆప్. అప్పటి నుంచి తమది జాతీయ పార్టీయేనని తేల్చి చెబుతోంది. పైగా...ప్రధాని మోదీని ఢీకొట్టగలిగేది తమ పార్టీ మాత్రమే అని చాలా ధీమా వ్యక్తం చేస్తోంది. అయితే...కర్ణాటక ఎన్నికల తేదీలు ప్రకటించే సమయంలో సీఈసీ రాజీవ్ కుమార్‌కు దీనిపైనే ఓ ప్రశ్న ఎదురైంది. "ఆప్‌ను జాతీయ పార్టీ గుర్తిస్తున్నారా..?" అని ఓ రిపోర్టర్ అడగ్గా...ఆయన ఆసక్తికర సమాధానమిచ్చారు. ప్రస్తుతానికి దీనిపై రివ్యూ చేస్తున్నామని చెప్పారు. ఇటీవలే పంజాబ్, హరియాణా కోర్టు లాయర్ హేమంత్ కుమార్ ఎన్నికల సంఘం కమిషనర్‌కు లేఖ రాశారు. ఈ లేఖలోనే ఆప్‌ను జాతీయ పార్టీగా గుర్తించాలంటూ ప్రస్తావించారు. ఢిల్లీతో పాటు పంజాబ్‌లోనూ ఈ పార్టీ అధికారంలో ఉందని, జాతీయ పార్టీగా కావాల్సిన అర్హత సాధించిందని అన్నారు. ప్రస్తుతానికి ఆప్‌ ఢిల్లీ, పంజాబ్‌తో పాటు గోవా, గుజరాత్‌లోనూ స్థానిక పార్టీ హోదా సాధించింది. గతేడాది గుజరాత్ ఎన్నికల ఫలితాలు విడుదలయ్యాక...ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ కీలక ప్రకటన చేశారు. "ఇకపై మనది జాతీయ పార్టీ" అని  కార్యకర్తలతో స్పష్టం చేశారు.