Chhawla Gang Rape Case: 2012 చావ్లా సామూహిక హత్యాచారం కేసులో సుప్రీం కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఈ కేసులో ముగ్గురు దోషులకు సుప్రీం కోర్టు ఊరటనిచ్చింది. ట్రయల్ కోర్టు, హైకోర్టు ఇచ్చిన తీర్పును తోసిపుచ్చి.. వారికి మరణ శిక్షను రద్దు చేసింది. ఈ మేరకు సీజేఐ జస్టిస్ యూయూ లలిత్ నేతృత్వంలోని ధర్మాసనం తీర్పు వెలువరించింది. 




ఇదీ కేసు


2012 ఫిబ్రవరిలో ఈ దారుణ ఘటన జరిగింది. ఫిబ్రవరి 9న దిల్లీ కుతుబ్‌ విహార్‌ వద్ద గురుగావ్‌ ఆఫీస్‌ నుంచి ఇంటికి వస్తున్న సమయంలో కారులో వచ్చిన దుండగులు 19 ఏళ్ల యువతిని ఎత్తుకెళ్లారు. మూడు రోజుల తర్వాత  హరియాణా రేవారి జిల్లా రోధాయి గ్రామ శివారులో సదరు యువతి మృతదేహం కుళ్లిపోయిన స్థితిలో కనబడటం కలకలం రేపింది.


ఈ మృతదేహాన్ని చూసి పోలీసులే అవాక్కయ్యారు. కారులోని పనిముట్లు, కుండపెంకులతో ఆమె జననాంగాలను ఛిద్రం చేసి ఘోరంగా హింసించి చంపారు దుండగులు. ఆమె ముఖంపై యాసిడ్ పోశారు. ఈ కిరాతకం దేశవ్యాప్త చర్చకు దారి తీసింది. బాధితురాలిపై సామూహిక అత్యాచారం జరిగిందని గుర్తించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని ఉత్తరాఖండ్‌కు చెందిన ముగ్గురు నిందితులను అరెస్ట్‌ చేశారు.


మరణశిక్ష 


2014 ఫిబ్రవరిలో దిల్లీ కోర్టు నిందితులు ముగ్గురిని దోషులుగా పేర్కొంటూ మరణ శిక్షను ఖరారు  చేసింది. ఈ తీర్పుపై వీళ్లు.. దిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. అయితే అదే ఏడాది ఆగష్టు 26న దిల్లీ హైకోర్టు మరణ శిక్షను సమర్థిస్తూ తీర్పు వెల్లడించింది. 


సుప్రీం


అయితే ఈ తీర్పుపై దోషులు.. సుప్రీం కోర్టును ఆశ్రయించారు. శిక్షను తగ్గించాలంటూ దోషుల తరపు న్యాయవాదులు కోర్టును అభ్యర్థించారు. వాళ్ల వయసు, కుటుంబ నేపథ్యాలు, గత చరిత్రలను పరిగణనలోకి తీసుకోవాలని కోర్టును కోరారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన సర్వోన్నత న్యాయస్థానం ముగ్గురు దోషులను నిర్దోషులుగా ప్రకటించింది.


తీర్పు సమయంలో కోర్టు హాల్‌లో ఉద్వేగపూరిత వాతావరణం నెలకొంది. తీర్పు చదివే సమయంలో బాధితురాలి తండ్రి చేతులు జోడించి నిల్చోగా సీజేఐ కీలక వ్యాఖ్యలు చేశారు. బాధితురాలి తండ్రి బాధను తాను అర్థం చేసుకోగలనని, కానీ వాస్తవాలు, సాక్ష్యాధారాలపైనే  తీర్పు ఉంటుందని సీజేఐ అన్నారు. సెంటిమెంట్లను పరిగణనలోకి తీసుకుంటే కేసు తప్పదారి పట్టే అవకాశం ఉందని, ఆ ముగ్గురిని నిర్దోషులుగా ప్రకటించారు.


Also Read: Mining Lease Case: సీఎం హేమంత్ సొరేన్‌కు సుప్రీం కోర్టులో బిగ్ రిలీఫ్