Chaos in Bengal assembly: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీలో గురువారం (సెప్టెంబర్ 4, 2025) జరిగిన సమావేశం రణరంగాన్ని తలపించింది. బెంగాలీ మాట్లాడే వలస కార్మికులపై బీజేపీ పాలిత రాష్ట్రాల్లో జరుగుతున్న దాడులను ఖండిస్తూ తీర్మానంపై చర్చ సందర్భంగా, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బీజేపీపై తీవ్ర విమర్శలు చేశారు. ఈ క్రమంలో, ప్రతిపక్ష బీజేపీ ఎమ్మెల్యేలు ఆమె ప్రసంగాన్ని అడ్డుకునేందుకు కేకలు, నినాదాలతో సభలో గందరగోళం సృష్టించారు. స్పీకర్ బిమన్ బెనర్జీ ఆదేశాల మేరకు మార్షల్స్ బీజేపీ ఎమ్మెల్యేలను బలవంతంగా సభ నుండి బయటకు తీసుకెళ్లారు.
బీజేపీ పాలిత రాష్ట్రాల్లో బెంగాలీ మాట్లాడే వలస కార్మికులపై జరుగుతున్న దాడులను ఖండిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీర్మానం ప్రవేశపెట్టింది. ఈ చర్చ సందర్భంగా మమతా బెనర్జీ మాట్లాడుతుండగా, బీజేపీ ఎమ్మెల్యేలు ప్రతిపక్ష నాయకుడు సువేందు అధికారి సస్పెన్షన్‌ను ప్రశ్నిస్తూ నినాదాలు చేశారు. ఈ గందరగోళంలో బీజేపీ చీఫ్ విప్ శంకర్ ఘోష్‌ను స్పీకర్ బిమన్ బెనర్జీ ఆ రోజు మిగిలిన సమావేశం నుండి సస్పెండ్ చేశారు. ఘోష్ సభ నుండి వెళ్లడానికి నిరాకరించడంతో, మార్షల్స్ అతన్ని బలవంతంగా బయటకు తీసుకెళ్లారు. ఈ క్రమంలో శంకర్ ఘోష్ గాయపడ్డారని బీజేపీ ఆరోపించింది.
తర్వాత నినాదాలు చేస్తున్న బీజేపీ ఎమ్మెల్యే అగ్నిమిత్రా పాల్‌ను కూడా సస్పెండ్ చేశారు. మహిళా మార్షల్స్ ద్వారా బయటకు తీసుకెళ్లారు. తర్వాత ఎమ్మెల్యేలు మిహిర్ గోస్వామి, అశోక్ దిండా, బంకిమ్ ఘోష్‌లను కూడా సస్పెండ్ చేశారు. ఈ సంఘటనలతో అసెంబ్లీ దాదాపు 15 నిమిషాల పాటు గందరగోళంగా మారింది. బీజేపీ ఎమ్మెల్యేలు సభలో నీటి సీసాలు విసిరారని, టీఎంసీ ఎమ్మెల్యేలు కూడా ప్రతిగా నినాదాలు చేశారని పరస్పరం విమర్శలు చేసుకుంటున్నారు.
మమతా బెనర్జీ తన ప్రసంగంలో బీజేపీని బెంగాల్ వ్యతిరేక, అవినీతిపరులు, ఓటు చోరీలో నిమగ్నమైన పార్టీగా విమర్శించారు. "బీజేపీ బెంగాలీ భాష, పేదలు, ఎస్సీలు, హిందువులకు వ్యతిరేకం. వారు అతి పెద్ద దొంగల ముఠాలు , ఓటు చోరీలో నిమగ్నమైన పార్టీ," అని ఆమె ఆరోపించారు. బీజేపీ బెంగాలీలపై వివక్ష చూపిస్తోందని దీనివల్ల బెంగాల్‌లో ఒక్క బీజేపీ ఎమ్మెల్యే కూడా గెలవకుండా ప్రజలే నిర్ణయిస్తారని ఆమె అన్నారు. "బీజేపీ ఢిల్లీ నుండి రిమోట్ కంట్రోల్‌తో బెంగాల్‌ను తమ కాలనీగా మార్చాలని కోరుకుంటోంది. వారు పార్లమెంట్‌లో మా ఎంపీలను సీఐఎస్‌ఎఫ్‌తో వేధించారు, ఇప్పుడు బెంగాల్‌లో కూడా మా గొంతును అణచివేయాలని చూస్తున్నారు," అని విమర్శించారు.
సభలో జరిగిన సంఘటనలను "బెంగాల్‌లో ప్రజాస్వామ్య హత్య"గా బీజేపీ అభివర్ణించింది. బీజేపీ చీఫ్ విప్ శంకర్ ఘోష్‌పై మార్షల్స్ దాడి చేశారని.. ఆరోపిస్తున్నారు. 2026 అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ, బెంగాలీ గుర్తింపు, ఓటరు జాబితాల తారుమారు, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో బెంగాలీలపై దాడులు వంటి అంశాలు రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా మారాయి.