నెల్లూరు జిల్లా కావలి పట్టణం ముసునూరు దళితవాడకు చెందిన దుగ్గిరాల కరుణాకర్ ఆత్మహత్య రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. తన చావుకి కారణం వైసీపీ నేతలే అంటూ ఆయన సూసైడ్ లెటర్ రాసి మరీ చనిపోయాడు. ఆ కుటుంబానికి టీడీపీ అండగా నిలిచింది. కరుణాకర్  మృతదేహానికి టీడీపీ రాష్ట్ర ఎస్సీ సెల్ అధ్యక్షులు ఎమ్మెస్ రాజు నివాళులు అర్పించారు. ఆ కుటుంబానికి న్యాయం జరిగే వరకు ఆందోళన చేపడతామంటూ పోలీసులతో వాగ్వాదానికి దిగారు టీడీపీ నేతలు. బాధిత కుటుంబంతో చంద్రబాబు ఫోన్ లో మాట్లాడారు. వారికి అండగా నిలబడతామని చెప్పారు. 


బాధిత కుటుంబాన్ని పరామర్శించిన నేతలు..


బాధిత కుటుంబానికి ధైర్యం చెప్పేందుకు టీడీపీ రాష్ట్ర ఎస్సీసెల్ నాయకులు ఎమ్మెస్ రాజు కావలి వచ్చారు. కరుణాకర్ చేపలు సాగు చేసిన చెరువును ఎమ్మెస్ రాజు సందర్శించారు. కరుణాకర్ ఆర్థికంగా నష్టపోయి బలవన్మరణానికి కారణమైన కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి, సురేష్ రెడ్డిని అరెస్టు చేయాలని డీఎస్పీ కార్యాలయాన్ని ముట్టడించారు. కాసేపు పోలీసులతో వాగ్వాదం జరిగింది. అనంతరం అధికారులు 24 గంటల్లోగా నిందితుల్ని పట్టుకుంటామని హామీ ఇచ్చారు. దీంతో ఆందోళన విరమించిన ఎమ్మెస్ రాజు, తదితరులు.. అక్కడినుంచి బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లారు. 




వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దళిత బిడ్డల ప్రాణాలు అకారణంగా గాల్లో కలిసి పోతున్నాయని ఆరోపించారు ఎమ్మెస్ రాజు. వైసీపీ నాయకుల దాష్టీకాన్ని తట్టుకోలేక తాను చనిపోతున్నానని సూసైడ్ నోట్ లో కరుణాకర్ రాసినా కూడా పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. కేవలం వైసీపీ నేతలు కావడం వల్లనే పోలీసులు వారిని వదిలిపెట్టారని అన్నారు. ఎస్సీ కమిషన్ కూడా ఈ విషయంలో నిమ్మకు నీరెత్తినట్టు ఉందని విమర్శించారు. పోలీసులు న్యాయం చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపడతాం అని అన్నారు. ఛలో కావలి కార్యక్రమం మొదలు పెడతామన్నారు. నారా లోకేష్ ఈ కార్యక్రమానికి వస్తారని, రాష్ట్ర వ్యాప్తంగా దళితుల ఐక్యత ఏంటో చూపిస్తామన్నారు. 


ఎన్టీఆర్ విగ్రహం ధ్వంసంలో కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి..


కావలి నియోజకవర్గంలో జగనన్న కాలనీల కోసం.. తన సొంత భూమిని ఐదురెట్ల ఎక్కువ ధరకు ప్రభుత్వానికి అమ్మేశారని ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిపై కూడా టీడీపీ నేతలు ఆరోపణలు చేశారు. ఇటీవల ఎన్టీఆర్ విగ్రహం మెడకు తాడు కట్టి లాగిన ఘటనలో కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి ప్రధాన ముద్దాయి అని, ఇప్పుడు దళిత యువకుడి ఆత్మహత్యకు కూడా అతనే కారణం అన్నారు. తాము అధికారంలోకి వచ్చాక కేతిరెడ్డికి బదులు చెబుతామన్నారు. 


పరారీలో ఉన్న నిందితులు..!


నెల్లూరు జిల్లా దళిత యువకుడి ఆత్మహత్య ఘటన రెండురోజుల్లోనే మరింత సంచలనంగా మారింది. వైసీపీ నేతలకు ఆత్మహత్యతో ప్రత్యక్ష సంబంధం ఉన్నట్టు సూసైడ్ లెటర్ బయట పడటంతో కేసు విషయంలో ఎటూ తేల్చలేకపోతున్నారు. నిందితులు పరారీలో ఉన్నట్టు చెబుతున్నారు పోలీసులు. వారికోసం గాలింపు చేపట్టినట్టు పేర్కొన్నారు.. అదే సమయంలో పోలీసులే నిందితుల్ని తప్పించారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. అటు వైసీపీ నేతలు మాత్రం ఈ విషయంలో సైలెంట్ గా ఉన్నారు. సూసైడ్ లెటర్ లో పేర్లు ఉన్న నాయకులు ప్రస్తుతం పరారీలో ఉన్నారు.