How much will your cigarette cost from Feb 1 : దేశవ్యాప్తంగా సిగరెట్లు, బీడీలు, పాన్ మసాలా ధరలు ఫిబ్రవరి 1, 2026 నుండి భారీగా పెరగనున్నాయి. పొగాకు ఉత్పత్తులపై అదనపు ఎక్సైజ్ సుంకాన్ని , పాన్ మసాలాపై కొత్త సెస్సును విధిస్తూ కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది. గత నెలలో పార్లమెంటు ఆమోదించిన 'సెంట్రల్ ఎక్సైజ్ (సవరణ) బిల్లు-2025' ఆధారంగా ఈ మార్పులు అమల్లోకి రానున్నాయి. ప్రజారోగ్యాన్ని కాపాడటం, పొగాకు వాడకాన్ని నిరుత్సాహపరచడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ కఠిన నిర్ణయం తీసుకుంది.
కొత్త నిబంధనల ప్రకారం, ఇప్పటివరకు ఉన్న జీఎస్టీ కాంపెన్సేషన్ సెస్ స్థానంలో అదనపు ఎక్సైజ్ సుంకం అమల్లోకి వస్తుంది. సిగరెట్లు, పాన్ మసాలా, ఇతర పొగాకు ఉత్పత్తులపై ఇప్పుడున్న 40 శాతం జీఎస్టీకి ఇది అదనం. ముఖ్యంగా సిగరెట్ల పొడవు, రకాన్ని బట్టి 1,000 స్టిక్స్‌పై రూ. 2,050 నుండి రూ. 8,500 వరకు అదనపు సుంకం పడనుంది. దీని వల్ల ప్రస్తుతం రూ. 18 రూపాయలకు లభిస్తున్న ఒక సిగరెట్ ధర రూ. 21 నుండి రూ. 22 వరకు పెరిగే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. పాన్ మసాలా తయారీదారులపై కేంద్రం మరింత కఠినంగా వ్యవహరించనుంది. దీనిపై హెల్త్ అండ్ నేషనల్ సెక్యూరిటీ సెస్ ను కొత్తగా ప్రవేశపెట్టారు. ఈ పన్ను ద్వారా వచ్చే ఆదాయాన్ని ప్రజారోగ్యం, జాతీయ భద్రత కోసం కేటాయించనున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. అలాగే, పాన్ మసాలా ప్యాకెట్ల పరిమాణంతో సంబంధం లేకుండా 10 గ్రాముల కంటే తక్కువ ఉన్న వాటికి కూడా రిటైల్ విక్రయ ధర , తర వివరాలను తప్పనిసరిగా ముద్రించాలని ప్రభుత్వం ఆదేశించింది.
ఈ పన్నుల మార్పు ద్వారా లభించే ఆదాయం కేంద్ర, రాష్ట్రాల మధ్య 41 శాతం వాటా పద్ధతిలో పంపిణీ అవుతుంది. ఇది సెస్ కాదు కాబట్టి రాష్ట్రాలకు కూడా ఇందులో వాటా దక్కుతుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. అదే సమయంలో, పొగాకు రైతులు , బీడీ కార్మికులకు నష్టం కలగకుండా ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహించే పథకాలను అమలు చేస్తామని కేంద్రం హామీ ఇచ్చింది. బీడీలపై జీఎస్టీని 18 శాతంగా నిర్ణయించడం ద్వారా సాధారణ కార్మికులపై భారం కొంత తగ్గించే ప్రయత్నం చేశారు. ఫిబ్రవరి 1 నుండి కొత్త ధరలు అమల్లోకి వస్తాయి. తయారీదారులు తమ ప్యాకింగ్ మెషీన్ల సామర్థ్యం ఆధారంగా పన్నులు చెల్లించేలా కొత్త నిబంధనలను కూడా ప్రభుత్వం రూపొందించింది.