Centre clarification on petrol shortage: రెండు రోజులుగా దేశంలోని పలు రాష్ట్రాల్లో పెట్రోల్ బంకుల వద్ద కనిపిస్తున్న భారీ క్యూలు, ఇంధన కొరతపై నెలకొన్న ఆందోళనలపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి సుజాతా శర్మ మీడియా ద్వారా దేశ ప్రజలకు కీలక సందేశం ఇచ్చారు. దేశంలో పెట్రోల్, డీజిల్ నిల్వలు పుష్కలంగా ఉన్నాయని, ప్రజలు ఎలాంటి భయాందోళనలకు గురికావాల్సిన అవసరం లేదని ఆమె స్పష్టం చేశారు.
భారత్‌లో కావాల్సినంత ఇంధన నిల్వలు
భారతదేశానికి ఏటా సుమారు 26 కోట్ల టన్నుల ముడి చమురును శుద్ధి చేసే సామర్థ్యం ఉందని సుజాతా శర్మ గుర్తుచేశారు. ఈ సామర్థ్యం మన దేశ అవసరాలకు సరిపడా ఇంధనాన్ని నిరంతరాయంగా అందించగలదని ఆమె పేర్కొన్నారు. పెట్రోల్ బంకులకు ఇంధనాన్ని సరఫరా చేసే టెర్మినల్స్‌లో కూడా తగినంత నిల్వలు ఉన్నాయని, సరఫరా గొలుసులో ఎలాంటి ఆటంకాలు లేవని ఆమె వివరించారు. ఈ గణాంకాలను బట్టి చూస్తే, క్షేత్రస్థాయిలో కొరత ఉందన్న ప్రచారంలో వాస్తవం లేదని కేంద్రం తేల్చిచెప్పింది.
పానిక్ బయింగ్ వల్లే సమస్య
గత రెండు రోజులుగా చాలా ప్రాంతాల్లో రిటైల్ అవుట్‌లెట్ల వద్ద ప్రజలు గంటల కొద్దీ వేచి ఉండటం, పానిక్ బయింగ్ అంటే భయంతో ఎక్కువ మొత్తంలో కొనుగోలు చేయడంకు దిగడం వల్లే కొన్ని చోట్ల తాత్కాలికంగా ఇబ్బందులు తలెత్తాయని ప్రభుత్వం గుర్తించింది. అవసరం లేకపోయినా ట్యాంకులు ఫుల్ చేయించుకోవడం వల్ల డిమాండ్ ఒక్కసారిగా పెరిగిందని, దీనిని కొరతగా భావించి మరింత ఆందోళన చెందవద్దని సుజాతా శర్మ కోరారు. పుకార్లను నమ్మి బంకుల వద్ద రద్దీ పెంచవద్దని ఆమె విజ్ఞప్తి చేశారు.
ధరల పెంపు లేదు
ఇంధన ధరలు పెరగబోతున్నాయనే వార్తలపై కూడా కేంద్రం స్పష్టత ఇచ్చింది. ప్రస్తుతానికి పెట్రోల్, డీజిల్ ధరలను పెంచే ఆలోచన ఏదీ లేదని, పాత ధరలే కొనసాగుతాయని స్పష్టం చేసింది. ధరల పెంపు భయంతో కూడా చాలా మంది స్టాక్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారని, అటువంటి తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని కేంద్రం సూచించింది. అంతర్జాతీయంగా చమురు ధరల్లో మార్పులు ఉన్నప్పటికీ, దేశీయంగా వినియోగదారులపై భారం వేయకుండా చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించింది.
రాష్ట్రాలకు ఆదేశాలు
తప్పుడు వార్తలు వ్యాప్తి చేసే వారిపై నిఘా ఉంచాలని, బంకుల వద్ద శాంతిభద్రతలను పర్యవేక్షించాలని కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది. కొన్ని చోట్ల ఆయిల్ కంపెనీలు బంకుల నుంచి నగదు ముందస్తుగా వసూలు చేస్తున్నాయనే ఫిర్యాదులపై కూడా అధికారులు దృష్టి సారించారు. నిరంతరాయంగా సరఫరా జరిగేలా ఆయిల్ కంపెనీలతో సమన్వయం చేసుకుంటున్నామని, ప్రజలు సంయమనం పాటించాలని కేంద్రం కోరింది.
కేంద్ర ప్రభుత్వ ప్రకటనతో పెట్రోల్ మంటలకు కొంతమేర ఉపశమనం లభించే అవకాశం ఉంది. క్షేత్రస్థాయిలో బంకుల వద్ద నిల్వలు వేగంగా నింపేలా చర్యలు తీసుకోవడంతో పాటు, ప్రజల్లో నమ్మకాన్ని కలిగించడం ఇప్పుడు అధికారుల ముందున్న సవాలు. నిరంతరాయంగా ఇంధనం అందుబాటులో ఉంటేనే ఈ ఆందోళనకర పరిస్థితులు సద్దుమణుగుతాయి.
