Central Govt to form an expert committee on Banakacharla Project:  బనకచర్ల ప్రాజెక్టుపై నిపుణుల కమిటీ ఏర్పాటుకు కేంద్ర జలశక్తి శాఖ కసరత్తు చేస్తోంది. ఈ ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్,   తెలంగాణ రాష్ట్రాల మధ్య వివాదాస్పదంగా మారింది. అందుకే  సాంకేతిక,  ఆర్థిక అంశాలను అధ్యయనం చేయడానికి 12 మంది సభ్యులతో ఒక నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయించింది. ఈ కమిటీలో ఏపీ ,  తెలంగాణ నుంచి ఐదుగురు నిపుణుల చొప్పున  పేర్లను పంపాలని కేంద్ర జలవనరుల శాఖ రెండు రాష్ట్రాలను కోరింది. అదనంగా, కేంద్రం తరపున మరో ఇద్దరు నిపుణులను ఈ కమిటీలో నియమించనుంది.            గోదావరి నది వరద జలాలను రాయలసీమ, ఉమ్మడి నెల్లూరు,   ప్రకాశం జిల్లాలకు తరలించే లక్ష్యంతో ఏపీ ప్రభుత్వం పోలవరం-బనకచర్ల లింక్ ప్రాజెక్టును ప్రతిపాదించింది. ఈ ప్రాజెక్టు ద్వారా 80 లక్షల మందికి తాగునీరు, 3 లక్షల హెక్టార్లకు కొత్త ఆయకట్టు,  22 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ లక్ష్యంగా రూ.80,112 కోట్లతో ఈ ప్రాజెక్టును రూపొందించారు. తెలంగాణ ప్రభుత్వం ఈ ప్రాజెక్టు గోదావరి నదిలో తమకు కేటాయించిన 968 టీఎంసీల నీటి హక్కులను హరిస్తుందని అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ ప్రాజెక్టు 1980 గోదావరి జల వివాద ట్రిబ్యునల్ అవార్డు ,  ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014ను ఉల్లంఘిస్తుందని తెలంగాణ  ఆరోపిస్తోంది. 

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి , మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ ప్రాజెక్టును అడ్డుకునేందుకు కేంద్ర జలశక్తి శాఖ, గోదావరి బోర్డు, , CWCకు  లేఖలు రాశారు. జనవరి 22, 2025న రాసిన లేఖలో, ఏపీ డీటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ (DPR) సమర్పించకుండా నిలువరించాలని కోరారు. తర్వాత కేంద్రమంత్రి సమక్షంలో ఇరు రాష్ట్రాల సీఎంలు సమావేశమయ్యారు. ఆ సమావేశంలో నిపుణుల కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.  బనకచర్ల వివాదాన్ని పరిశీలించడానికి, ఇరు రాష్ట్రాల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని సాంకేతిక ,  ఆర్థిక అంశాలపై అధ్యయనం చేయడానికి కేంద్ర జలశక్తి శాఖ 12 మంది నిపుణులతో కమిటీ ఏర్పాటు చేయనుంది. ఈ కమిటీలో ఏపీ ,  తెలంగాణ నుంచి సాంకేతిక నిపుణులు, అడ్మినిస్ట్రేటివ్ అధికారులు ఉంటారు. ఏపీ ప్రభుత్వం ఈ ప్రాజెక్టుకు సంబంధించి ప్రీ-ఫీజిబిలిటీ రిపోర్ట్ (PFR)ను సెంట్రల్ వాటర్ కమిషన్ (CWC)కు సమర్పించింది. ప్రాజెక్టు పనులు ఇంకా ప్రారంభం కాలేదని ఏపీ కేంద్రానికి తెలిపింది. తెలంగాణ అభ్యంతరాల కారణంగా కేంద్ర జలశక్తి శాఖ గోదావరి ,  కృష్ణా నదీ యాజమాన్య బోర్డులతో సంప్రదించి, తెలంగాణ అభిప్రాయాలను సేకరించిన తర్వాత మాత్రమే సాంకేతిక ,  ఆర్థిక అంచనాలపై ముందుకెళ్తామని స్పష్టం చేసింది 

ఈ ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతుల కోసం ఏపీ ప్రభుత్వం టర్మ్ ఆఫ్ రిఫరెన్స్ (TOR)ను కేంద్ర అటవీ, పర్యావరణ శాఖకు చెందిన పర్వేష్ వెబ్‌సైట్‌లో నమోదు చేసింది. అయితే, ఎక్స్‌పర్ట్స్ అప్రైసల్ కమిటీ (EAC) ఈ ప్రతిపాదనలను పరిశీలించి వెనక్కి పంపినట్లు కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ సహాయ మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ రాజ్యసభలో తెలిపారు.