Center has issued orders imposing President rule in Manipur: దేశంలోనే కల్లోలిత రాష్ట్రంగా ఉన్న మణిపూర్ లో కేంద్ర రాష్ట్రపతి పాలన విధించింది. ఢిల్లీ ఎన్నికల ఫలితాల తర్వాత సీఎం బీరేన్ సింగ్ తో బీజేపీ పెద్దలు రాజీనామాలు చేయించారు. మణిపూర్ లో హింసను ఏ మాత్రం తగ్గించకపోగా పెరిగేలా ఓ వర్గానికి ఆయుధాలు సమకూర్చేలా బీరేన్ సింగ్ వ్యవహరించారన్న విమర్శలు రావడంతో ఆయనతో రాజీనామా చేయించారు. మణిపూర్ పరిస్థితుల్ని చక్కదిద్దడానికి వేరే ముఖ్యమంత్రిని నియమించడం కన్నా.. కేంద్ర పాలన ఉండటం మంచిదన్న అభిప్రాయంతో రాష్ట్రపతి పాలన విధించారు.
రెండేళ్లుగా జాతుల మధ్య సమరంతో నలిగిపోతున్న మణిపూర్
మణిపూర్ రెండేళ్లుగా రావణకాష్టంగా మారింది. రాజీనామా చేసిన బీరెన్ సింగ్‌పై ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయిన ఆడియో క్లిప్పులు సంచలనం సృష్టించాయి. డియో క్లిప్పుల వ్యవహారాన్ని కుకీ ఆర్గనైజేషన్ ఫర్ హ్యూమన్ రైట్స్ ట్రస్ట్ సంస్థ సర్వోన్నత న్యాయస్థానం దృష్టికి తీసుకువెళ్ళింది. ప్రభుత్వ కార్యాలయాల్లో ఆయుధాలను దోచుకునేందుకు మైతేయీలకు అవకాశమివ్వండంటూ బీరెన్ సింగ్ ఆదేశిస్తున్నట్లుగా ఆ ఆడియో క్లిప్పుల్లో ఉంది.
హింసను ప్రేరేపించినట్లుగా సీఎం బీరేన్ సింగ్ పై ఆరోపణలు
ఆ గొంతు అక్షరాలా బీరేన్ దేనంటూ హైదరాబాద్‌కు చెందిన ఒక ప్రముఖ ఫోరెన్సిక్ ల్యాబ్ ధ్రువీకరించింది. అయితే బీరేన్ న్యాయవాదులు అభ్యంతరం చెప్పడంతో సదరు ఆడియో క్లిప్పులను కేంద్ర ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపాలంటూ సుప్రీం కోర్టు ఆదేశించింది. దీంతో రెండేళ్ళుగా జాతుల సమరంతో ఒక రాష్ట్రం అతలాకుతలమవుతున్నా చూసీచూడనట్లు, అంటీముట్టనట్లు వ్యవహరిస్తున్నారన్న విమర్శలు చుట్టుముట్టాయి. 2023 మే నెలలో మైతేయిలు, కుకీల మధ్య మొదలైన వైరంలో కొన్ని వందల మంది చనిపోయారు. 60 వేల మంది నిరాశ్రయులై, సహాయక శిబిరాల్లో మగ్గుతున్నారు.
శాంతి నెలకొల్పేందుకు స్వయంగా కేంద్రం సంకల్పించే అవకాశం
రాజకీయంగా అస్థిరంగా ఉండటం.. మళ్లీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తే అల్లర్లు జరిగే అవకాశాలు ఉండటంతో కేంద్రం రాష్ట్రపతి పాలన వైపు మొగ్గు చూపింది. మైతేయిలు, కుకీల సామరస్యం ఏర్పడితే తప్ప శాంతి ఏర్పడదు. అందుకే కేంద్రం గవర్నర్ ద్వారా పాలన చేసి.. పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేసే అవకాశాలు ఉన్నాయి.