Balasore train accident : ఒడిషాలోని బాలాసోర్ లో జరిగిన రైలు ప్రమాద దుర్ఘటనలో ముగ్గురు రైల్వే ఉద్యోగుల్ని సీబీఐ అరెస్ట్ చేసింది. సీనియర్ సెక్షన్ ఇంజినీర్ అరుణ్ కుమార్ మహంత, సెక్షన్ ఇంజినీర్ అమీర్ ఖాన్, టెక్నిషియన్ పప్పు కుమార్ లను అరెస్ట్ చేశారు. వీరిపై సీఆర్సీసీ 304, 201 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.
దర్యాప్తులో ఉద్యోగుల నిర్లక్ష్యమేనని తేల్చిన సీబీఐ
జూన్ 2 రాత్రి 7 గంటల సమయంలో ఒడిశాలోని బాలేశ్వర్ జిల్లా బహనాగా బజార్ రైల్వే స్టేషన్ సమీపంలో ఘోర ప్రమాదం జరిగింది. ఈ ఘటనకు గల కారణాలను అన్వేషించేందుకు కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ రంగంలోకి దింపారు. ఒడిశా రైలు ప్రమాదంలో ఏదైనా కుట్ర కోణం ఉందా అన్న కోణంలో సీబీఐ బృందం దర్యాప్తు చేస్తోంది. ఈ దర్యాప్తులో భాగంగా రైల్వే శాఖ ఉద్యోగులు, సిబ్బంది సహా పలువురిని ఇప్పటికే సీబీఐ అధికారులు విచారణ జరిపారు. అయితే ఎలాంటి కుట్ర లేదని..ఉద్యోగుల నిర్లక్ష్యం వల్లనే ప్రమదం జరిగిందని గుర్తించి..కేసులు నమోదు చేసి అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తోంది.
కమిషన్ ఆఫ్ రైల్వే సేఫ్టీ కూడా ఉద్యోగుల తప్పేనని రిపోర్ట్
మరో వైపు కమిషన్ ఆఫ్ రైల్వే సేఫ్టీ కూడా అధ్యయనం చేసింది. ఉద్యోగుల అజాగ్రత్త వల్లే 3 రైళ్లు ఢీకొని ఈ దుర్ఘటన చోటు చేసుకుందని కమిషన్ ఆఫ్ రైల్వే సేఫ్టీ తేల్చింది. సిగ్నలింగ్, టెలి కమ్యూనికేషన్ విధుల్లో ఉన్న ఉద్యోగులు సరైన విధంగా స్పందించకపోవడం వల్లే ఒడిశాలోని బాలేశ్వర్ జిల్లా బహానగాలో అత్యంత ఘోరమైన రైలు ప్రమాదం జరిగినట్లు కమిషన్ ఆఫ్ రైల్వే సేఫ్టీ నివేదిక రూపొందించింది. దానికి సంబంధించి రైల్వే శాఖ ఉన్నతాధికారులకు నివేదికను కూడా అందజేసింది. సంబంధిత సిబ్బంది విధుల్లో నిర్లక్ష్యం వహించడంతోనే లూప్‌లైన్‌లో ఆగి ఉన్న గూడ్స్ రైలును కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ ఢీకొట్టిందని తెలిపింది. ఆ తర్వాత దాని బోగీలు పక్క ట్రాక్‌పై పడగా.. అటుగా వస్తున్న మరో రైలు ఢీకొట్టి పట్టాలు తప్పినట్లు అందులో పేర్కొంది. అయితే ఈ నివేదికను ఇంకా అధికారికంగా బయట పెట్టాల్సి ఉంది.
ఇప్పటికీ పూర్తి కాని మృతదేహాల గుర్తింపు
బాలాసోర్ రైలు ప్రమాదంలో 290 మందికి పైగా మరణించారు మరియు 1,000 మందికి పైగా గాయపడ్డారు. ఇంకా గుర్తించని మృతదేహాలు ఎన్నో భువనేశ్వర్ ఆస్పత్రుల్లో ఉన్నాయి. డీఎన్ఏ పరీక్షల ఆధారంగా అప్పగిస్తామని రైల్వే శాఖ విస్తృతంగా ప్రకటనలు ఇస్తోంది. రెండు ప్యాసింజర్ రైళ్లతో సహా మూడు రైళ్లు ఢీకొన్న ఈ దుర్ఘటన గత రెండు దశాబ్దాలలో జరిగిన ఘోర రైలు ప్రమాదం .సంఘటన జరిగిన సౌత్ ఈస్టర్న్ రైల్వే నుండి కనీసం ఏడుగురు సీనియర్ మోస్ట్ అధికారులను బదిలీ చేసారు. సౌత్ ఈస్టర్న్ రైల్వే జనరల్ మేనేజర్‌ను కూడా బదిలీ చేశారు.