By Election Results 2024: లోక్‌సభ ఎన్నికల్లో NDA కూటమికి గట్టి పోటీ ఇచ్చిన ఇండీ కూటమి జులై 10న జరిగిన అసెంబ్లీ ఉప ఎన్నికల్లోనూ అదే స్థాయిలో పోటీ ఇచ్చింది. మొత్తం 7 రాష్ట్రాల్లో 13 స్థానాలకు ఉప ఎన్నికలు జరిగాయి. వాటి ఫలితాలు వెలువడ్డాయి. ఇండీ కూటమి 10 సీట్‌లు గెలుచుకుంది. అటు బీజేపీ మాత్రం కేవలం రెండు స్థానాలకే పరిమితమైంది. పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, వెస్ట్ బెంగాల్, బిహార్, తమిళనాడు, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్‌లో ఈ ఉప ఎన్నికలు జరిగాయి. ఇండీ కూటమిలోని పార్టీలైన కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్,డీఎమ్‌కే, ఆప్ అభ్యర్థులు ఈ ఎన్నికల బరిలో దిగి విజయం సాధించారు. ఇలా బీజేపీకి మరోసారి ఈ కూటమి షాక్ ఇచ్చింది. రాష్ట్రాల వారీగా చూసుకుంటే పంజాబ్‌లోని జలంధర్‌లో గెలవడం ఆప్‌కి చాలా కీలకమైంది. ముఖ్యమంత్రి భగవంత్‌ మాన్‌కే ఇది ఓ పరీక్ష లాంటిది. అంత కీలకమైన నియోజకవర్గంలో 23 వేల ఓట్ల మెజార్టీతో ఆప్ అభ్యర్థి విజయం సాధించారు. ఇక పశ్చిమ బెంగాల్‌లో నాలుగు చోట్ల ఎన్నికలు జరగ్గా అన్ని చోట్లా తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థులు గెలిచారు. బీజేపీ వెనకబడిపోయింది. 


తొలిసారి ఎన్నికల బరిలోకి దిగిన హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుఖు సతీమణి కమ్లేశ్ ఠాకూర్ విజయం సాధించారు. డెహ్రా నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచారు. మరో చోట కూడా కాంగ్రెస్ గెలిచింది. తమిళనాడులో విక్రవంది నియోజకవర్గంలో DMK అభ్యర్థి విజయం సాధించారు. ఉత్తరాఖండ్‌లో బద్రినాథ్‌తో పాటు మంగళూర్ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ విజయ పతాకం ఎగరేసింది. ఈ రెండు చోట్లా బీజేపీ వెనకబడింది. అటు బిహార్‌లో జేడీయూ అభ్యర్థి ముందు ఆధిక్యంలో ఉన్నప్పటికీ ఆ తరవాత స్వతంత్ర అభ్యర్థి లీడ్‌లోకి వచ్చారు. ఇవాళ ఉదయం నుంచి ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. లోక్‌సభ ఎన్నికల ఫలితాల తరవాత వెలువడుతున్న ఫలితాలు కావడం వల్ల ఉత్కంఠ పెరిగింది. పైగా బీజేపీ గ్రాఫ్ పడిపోయిందన్న వాదనలు వినిపిస్తున్న సమయంలోనే ఇలాంటి రిజల్స్ట్ రావడం మరింత కీలకంగా మారింది. మెజార్టీ స్థానాల్లో ప్రతిపక్ష కూటమి అభ్యర్థులే విజయం సాధించడం ఆ పార్టీలకు మరింత జోష్ ఇచ్చింది.