Bus Accident in Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దుర్గ్ జిల్లాలో ఓ బస్సు అదుపు తప్పి లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో 12 మంది ప్రాణాలు కోల్పోయారు. కనీసం 14 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో బస్సులో 30 మంది ప్రయాణికులున్నారు. మార్చి 9వ తేదీన రాత్రి 8.30 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్టు పోలీసులు వెల్లడించారు. బస్‌లో ఉన్న వాళ్లంతా కూలీలే. ఓ సంస్థలో విధులు పూర్తి చేసుకుని తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. గాయపడిన వాళ్లను స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతానికి వాళ్ల ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్టు అధికారులు తెలిపారు. జిల్లా కలెక్టర్ వెంటనే అప్రమత్తమై హాస్పిటల్‌కి వెళ్లారు. గాయపడిన వాళ్లకి మెరుగైన చికిత్స అందిస్తామని హామీ ఇచ్చారు. బస్‌లో ఇరుక్కున్న వాళ్లని బయటకు తీసుకురావడం కష్టమైపోయింది. దాదాపు 45 అడుగుల నుంచి పడిపోవడం వల్ల బస్సు పూర్తిగా ధ్వంసమైపోయింది. ప్రమాదానికి కారణమేంటన్నది ఇంకా తెలియరాలేదు. దీనిపై విచారణ కొనసాగిస్తున్నారు. ఈ ఘటనపై ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి విష్ణు దియో సాయి స్పందించారు. ప్రమాద వార్త తనకి దిగ్భ్రాంతి కలిగించిందని అన్నారు. మృతుల కుటుంబ సభ్యులకు సంతాపం తెలిపారు. గాయపడిన వాళ్లకి మెరుగైన చికిత్స అందిస్తామని వెల్లడించారు. X వేదికగా ఓ పోస్ట్ పెట్టారు.