Telangana Map Controversy: తెలంగాణ లేకుండా ఉన్న మ్యాప్ ను లోకేష్‌కు ఏపీ బీజేపీ అధ్యక్షుడు మాధవ్ ఇచ్చారని ఇది తెలంగాణ అస్థిత్వంపై దాడి అని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. తెలంగాణ భవన్ లో ప్రెస్ మీట్ పెట్టిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ఏపీ బీజేపీ అధ్యక్షుడు మాధవ్ భారతీయ సాంస్కృతిక వైభవం పేరిట నారా లోకేష్ కు ఇచ్చిన చిత్రపటంలో తెలంగాణ మ్యాప్ లేదని ఫోటో చూపించారు. ఈ అంశాన్ని దాము తీవ్రంగా ఖండిస్తున్నామని ఇది రాజ్యాంగ నియమాలను ఉల్లంఘించడమేనని అన్నారు. చంద్రబాబు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అడ్డుకున్నారని.. తెలంగాణ లేని చిత్రపటాన్ని బీజేపీ నేత ఇవ్వడం టీడీపీ నేత తీసుకోవడం నరనరాల్లో వారికి తెలంగాణ అంటే ఇష్టం లేని తీరును సూచిస్తోందన్నారు. తెలంగాణ లేని చిత్రపటం ఇవ్వడం అంటే.. తెలంగాణ అస్ధిత్వంపై దాడిగానే భావిస్తామన్నారు.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ప్రధానమంత్రి నరేంద్రమోదీకి సోషల్ మీడియాలో ఫిర్యాదు చేశారు. తరతరాలుగా సాంస్కృతిక గుర్తింపు, చరిత్రలో సరైన భౌగోళిక స్థానం కోసం పోరాడుతున్నామమన్నారు. అలాంటిది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బిజెపి చీఫ్ మాధవ్ ఐక్య ఆంధ్రప్రదేశ్ మ్యాప్‌ను బహుమతిగా ఇచ్చి, తెలంగాణ ఉనికిని విస్మరించడం ద్వారా మా పోరాటాన్ని తక్కువ చేశారని తెలిపారు. ఇది ఆమోదయోగ్యం కాదన్నారు. మా పోరాటానికి, అమరవీరుల త్యాగాలకు, చరిత్రకు స్పష్టమైన నిర్లక్ష్యమన్నారు. ఇది మీ పార్టీ రాజకీయ ఎజెండానో కాదో స్పష్టం చేయాలన్నారు. బీజేపీ నాయకత్వం ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా నూతనంగా ఎన్నికైన పీవీఎన్ మాధవ్ బుధవారం ఉండవల్లి నివాసంలో నారా లోకేష్ ను మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా మాధవ్ కు వెంకటశ్వరస్వామి ప్రతిమ గిఫ్టుగా లోకేష్ ఇచ్చారు. మాధవ్.. భారతీయ సాంస్కృతిక వైభవం చిత్రపటాన్ని ఇచ్చారు. అందులో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉంది. తెలంగాణను ప్రత్యేకంగా చూపించలేదు. అదే బీఆర్ఎస్ నేతలకు కోపం తెప్పించింది.
ఈ వివాదంపై మ్యాప్ ఇచ్చిన ఏపీ బీజేపీ అధ్యక్షుడు మాధవ్ ఇంకా స్పందించలేదు.