Massive Floods in Brazil: బ్రెజిల్‌ని వరదలు (Brazil Flooding) ముంచెత్తుతున్నాయి. దాదాపు వారం రోజులుగా అక్కడ భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీగా ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లింది. ఈ బీభత్సం ఇంకా కొనసాగుతూనే ఉంది. అధికారిక లెక్కల ప్రకారం కనీసం 100 మంది ప్రాణాలు కోల్పోయారు. లక్ష ఇళ్లు పూర్తిగా ధ్వంసమైపోయాయి. ప్రభావిత ప్రాంతాల్లోని బాధితులను రక్షించేందుకు ప్రభుత్వం అన్ని విధాలుగా ప్రయత్నిస్తోంది. మే 8వ తేదీ లెక్కల ఆధారంగా చూస్తే...నదులు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయి. ఇప్పటి వరకూ ఈ వరదలు 14 లక్షల మందిపై ప్రభావం చూపించాయి. 2 లక్షల మందిని నిరాశ్రయులయ్యారు. దాదాపు లక్ష ఇళ్లు పూర్తిగా కొట్టుకుపోయాయని Civil Defence ఏజెన్సీ వెల్లడించింది. ఏప్రిల్ 29వ తేదీ నుంచి ఈ భారీ వర్షాలు (Floods in Brazil) కొనసాగుతూనే ఉన్నాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకూ కళ్ల ముందే ఇళ్లు వరదలో పడి కొట్టుకుపోతున్న ఘటనలు నమోదవుతున్నాయి. మరి కొన్ని పాక్షికంగా ధ్వంసమయ్యాయి. దాదాపు 414 సిటీలు వరద నీటితో నిండిపోయాయి. వ్యవసాయం దారుణంగా దెబ్బ తింది. పంట పొలాలు ధ్వంసమైపోయాయి. ఈ వరదలా కారణంగా ఇప్పటి వరకూ 400 కోట్ల రియల్స్ మేర ఆస్తి నష్టం వాటిల్లినట్టు అధికారులు అంచనా వేస్తున్నారు. బ్రెజిల్‌లోని Rio Grande do Sul రాష్ట్రంలోనే ఈ నష్టం ఎక్కువగా కనిపిస్తోంది. 5 నెలల వర్షపాతం కేవలం ఒకే ఒక వారంలో నమోదైనట్టు వాతావరణ శాఖ వెల్లడించింది.
ప్రస్తుత పరిస్థితులపై బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్ ఇనాకియో లుల డా సిల్వా ( Luiz Inacio Lula da Silva) స్పందించారు. ఎప్పటికప్పుడు అధికారులతో మాట్లాడుతూ అన్ని వివరాలు ఆరా తీస్తున్నట్టు వెల్లడించారు. బాధితులెవ్వరికీ ఎలాంటి ఇబ్బంది కలగకుండా ప్రభుత్వం తరపున అన్ని విధాలుగా సాయం అందిస్తామని స్పష్టం చేశారు. నిరాశ్రయులైన వాళ్లకి పునరావాసం కల్పించే పనిలో ఉన్నట్టు తెలిపారు. వరదల ప్రభావం తగ్గే వరకూ ఈ సహాయక చర్యలు కొనసాగుతాయని లూయిజ్ వెల్లడించారు. సుమారుగా లక్షన్నర మంది సైనికులు, అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు, వాలంటీర్లు కలిసి రాత్రి పగలనకా సాయం అందిస్తున్నారు. వరదల్లో చిక్కుకున్న వాళ్లని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.
"రియో గ్రాండో రాష్ట్రంలో ప్రస్తుతం ఏ స్థాయిలో నష్టం వాటిల్లుతోందో గమనిస్తున్నాం. ఎప్పటిప్పుడు పరిస్థితులపై సమీక్ష జరుపుతున్నాను. బాధితులెవరూ ఆందోళనం చెందాల్సిన పని లేదు. ప్రభుత్వం తరపున అన్ని విధాలా సహకారం అంది తీరుతుంది. వరదలు ఎటు నుంచి ఎటువైపు కదులుతున్నాయన్నది సరిగ్గా తెలియడం లేదు. పరిస్థితులు అదుపులోకి వచ్చిన తరవాత కానీ ఇది అర్థమయ్యేలా లేదు"
- లూయిజ్ ఇనాకియో, బ్రెజిల్ అధ్యక్షుడు
Also Read: Air India Express: సెలవు పెట్టిన 30 మంది ఉద్యోగులపై వేటు- ఎయిర్ ఇండియా సంచలన నిర్ణయం