Mumbai Municipal Elections polling over : మహారాష్ట్రలో అత్యంత ప్రతిష్టాత్మకమైన బృహణ్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ తో పాటు మరో 28 మున్సిపల్ కార్పొరేషన్లకు గురువారం పోలింగ్ ముగిసింది. దేశంలోనే అత్యంత సంపన్నమైన పౌర సంస్థగా పేరుగాంచిన బీఎంసీ ఎన్నికలు దాదాపు నాలుగేళ్ల ఆలస్యం తర్వాత జరిగాయి. ముంబైలోని 227 స్థానాలకు 1,700 మంది అభ్యర్థులు బరిలో నిలవగా, 3.48 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ ఎన్నికల్లో ప్రధానంగా మహాయుతి కూటమిలోని బీజేపీ, ఏక్నాథ్ షిండే శివసేన, అజిత్ పవార్ ఎన్సీపీ, మహా వికాస్ కూటమిలోని అఘాడీ ఉద్ధవ్ థాకరే శివసేన, కాంగ్రెస్, శరద్ పవార్ ఎన్సీపీ పార్టీల మధ్య హోరాహోరీ పోరు సాగింది.
బీఎంసీ పోలింగ్ ముగిసిన వెంటనే వెలువడిన యాక్సిస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఆసక్తికరంగా ఉన్నాయి. ఈ సర్వే ప్రకారం ముంబైలో బీజేపీ, దాని మిత్రపక్షాలకు స్వల్ప ఆధిక్యం లభించే అవకాశం ఉంది. అయితే, వయోవృద్ధులు 61 ఏళ్లు పైబడిన వారు మాత్రం ఉద్ధవ్ థాకరే నేతృత్వంలోని శివసే వైపు మొగ్గు చూపినట్లు సర్వే పేర్కొంది. 20 ఏళ్ల తర్వాత ఏకమైన థాకరే సోదరులు తమ పూర్వ వైభవాన్ని కాపాడుకోగలరా లేదా అనేది శుక్రవారం ఫలితాల్లో తేలనుంది. ఓటింగ్ శాతం ఓ మాదిరిగా ఉంది.
పోలింగ్ ప్రక్రియలో పలు వివాదాలు కూడా చోటుచేసుకున్నాయి. ఓటర్ల వేలిపై వేసే సిరా ను శానిటైజర్ లేదా స్పిరిట్‌తో సులభంగా చెరిపివేయవచ్చని ఉద్ధవ్ థాకరే, రాజ్ థాకరే ఆరోపించారు. ఇది పెద్ద ఎత్తున రిగ్గింగ్‌కు దారితీసే అవకాశం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. అయితే, రాష్ట్ర ఎన్నికల కమిషనర్ దినేష్ వాగ్మారే ఈ ఆరోపణలను తోసిపుచ్చారు. కేంద్ర ఎన్నికల సంఘం ఉపయోగించే నాణ్యమైన సిరానే వాడుతున్నామని, ఇది ఆరడానికి 15 సెకన్ల సమయం పడుతుందని ఆయన స్పష్టం చేశారు.
ముంబై ఎన్నికల వేళ బాలీవుడ్ ప్రముఖులు సందడి చేశారు. సచిన్ టెండూల్కర్, అమీర్ ఖాన్, అక్షయ్ కుమార్, శ్రద్ధా కపూర్ వంటి సెలబ్రిటీలు తమ ఓటు హక్కును వినియోగించుకుని ప్రజలను చైతన్యపరిచారు. ఈ ఎన్నికల ఓట్ల లెక్కింపు శుక్రవారం జరగనుంది. ముంబై మకుటాన్ని ఏ పార్టీ దక్కించుకుంటుందనే అంశంపై దేశవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది.