BJP : హైదరాబాద్‌‌లలో ఉన్న పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్శిటీ పేరును సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయంగా మార్చడాన్ని బీజేపీ వ్యతిరేకించింది. అసలు పొట్టి శ్రీరాములు పేరు ఎందుకు మార్చాల్సి వచ్చిందని అసెంబ్లీలో ఆ పార్టీ పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ప్రశ్నించారు. ఉస్మానియా యూనివర్శిటికీ సురవరం ప్రతాపరెడ్డి పేరు పెట్టాలని సూచించారు. పొట్టి శ్రీరాములు పేరు మార్చడం అవివేకమైన చర్య అని స్పష్టం చేశారు. పొట్టి శ్రీరాములు ఒక ప్రాంతానికే పరిమితమైన వ్యక్తి  కాదన్నారు.ఆయన తెలుగువారందరి కోసం  పోరాటం చేశారని గుర్తు చేశారు.                         


ఆంధ్రప్రదేశ్ బీజేపీ నేతలు కూడా  తెలంగాణ ప్రభుత్వ నిర్ణయాన్ని ఖండించారు. పొట్టి శ్రీరాములు తెలుగు భాష, సంస్కృతి,  ఆత్మగౌరవం కోసం తన ప్రాణాలను అర్పించిన మహానీయుడని ఏపీ బీజేపీ ఉపాధ్యక్షుడు విష్ణువర్దన్ రెడ్డి గుర్తు చేశారు. అటువంటి గొప్ప త్యాగమూర్తి పేరు మీద ఉన్న “పొట్టి శ్రీరాములు తెలుగువిశ్వవిద్యాలయం” పేరును మార్చడం తెలుగు భాషను, కోట్ల మంది తెలుగువారి గౌరవాన్ని అవమానించే చర్య అని విమర్శించారు.   కాంగ్రెస్‌కు గాంధీ కుటుంబం తప్ప ఏ స్వాతంత్ర్య సమరయోధుల గౌరవించడం తెలియదని ఆరోపించారు 


స్వాతంత్ర్య పోరాటంలో కీలక పాత్ర పోషించిన సర్దార్ వల్లభాయ్ పటేల్ నుంచి, తెలుగువారి గౌరవంగా నిలిచిన పీవీ నరసింహరావు రకు స్వంత పార్టీ  కాంగ్రెస్ నేతలను సైతం ఎవ్వరినీ గౌరవించలేదని విష్ణువర్ధన్ రెడ్డి గుర్తు చేశారు.  ఇప్పుడు అదే ద్వేషంతో, తెలుగు భాష కోసం ప్రాణత్యాగం చేసిన పొట్టి శ్రీరాములు పేరును ఆయన జన్మదినానే తొలగించడం కాంగ్రెస్ ప్రభుత్వం తెలుగువారిపై చూపుతున్న   బాద్యతా రాహిత్య చర్యలకు  ఈ నిర్ణయమే ఓక నిదర్శనమన్నారు..                    


ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిజమైన ప్రజాస్వామ్యవాదివైతే,  హైదరాబాద్ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి పేరు మార్చగలరా అని ప్రశ్నించారు.  తెలుగువారి ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు, తెలుగు ప్రజలను కించపరిచే ఈ నిర్ణయాన్ని తక్షణమే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.  ప్రతి తెలుగు బిడ్డ ఈ అవమానాన్ని తీవ్రంగా ఖండించాలి. బీజేపీ ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ, పొట్టి శ్రీరాములు పేరు న్యాయం జరిగే వరకు  కాంగ్రెస్ పై పోరాటం చేస్తుందని విష్ణువర్దన్ రెడ్డి ప్రకటించారు.                       



తెలుగు రాష్ట్రాలకు చెందిన బీజేపీ నేతలంతా..  పొట్టి శ్రీరాములను కాంగ్రెస్ ప్రభుత్వం అవమానించిందని విమర్శలు చేస్తున్నారు.