BJP candidate manhandled allegedly by TMC workers: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల తొలి దశ పోలింగ్ సందర్భంగా దక్షిణ దినాజ్‌పూర్ జిల్లాలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. కుమార్‌గంజ్ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి సువేందు సర్కార్‌పై తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. పోలింగ్ సరళిని పరిశీలించేందుకు వెళ్లిన ఆయనను అడ్డుకుని, భౌతికంగా దాడి చేయడంతో ఆ ప్రాంతంలో కలకలం రేగింది. గురువారం నియోజకవర్గంలోని బూత్ నంబర్ 24 వద్ద గందరగోళం జరుగుతోందన్న సమాచారంతో సువేందు సర్కార్ అక్కడికి చేరుకున్నారు. ఆ సమయంలో కొందరు వ్యక్తులు ఆయనను చుట్టుముట్టి నెట్టివేస్తూ, దాడికి దిగారు. తన ప్రాణాలను కాపాడుకునేందుకు ఆయన పొలాల గుండా పరుగులు తీయాల్సి వచ్చింది. ఈ క్రమంలో ఆయన వెంట సెక్యూరిటీగా ఉన్న పోలీసు అధికారి ఆందోళనకారుల నుంచి ఆయనను రక్షించేందుకు విఫలయత్నం చేశారు. తమ వాహనాన్ని కూడా ధ్వంసం చేశారని అభ్యర్థి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దాడి జరిగిన సమయంలో అక్కడ కేంద్ర బలగాలు ఎవరూ లేరని సువేందు సర్కార్ ఆరోపించారు. పోలింగ్ కేంద్రం లోపల భద్రతా దళాలు ఉన్నాయి కానీ, బయట మమ్మల్ని చుట్టుముట్టి కొడుతుంటే రక్షించే వారు లేరు అని ఆయన పేర్కొన్నారు. తమ ఏజెంట్లను కూడా బలవంతంగా బూత్‌ల నుంచి వెళ్లగొడుతున్నారని, దీనిపై ప్రశ్నించినందుకే తనపై దాడి చేశారని ఆయన మీడియాకు వివరించారు. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఓటమి భయంతోనే ఇలాంటి దాడులకు పాల్పడుతున్నారని విమర్శించారు.
దక్షిణ దినాజ్‌పూర్‌తో పాటు ఉత్తర బెంగాల్‌లోని పలు ప్రాంతాల్లో చెదురుమదురు హింసాత్మక ఘటనలు నమోదయ్యాయి. ఓటర్లను భయభ్రాంతులకు గురిచేయడం, ప్రత్యర్థి పార్టీల ఏజెంట్లను అడ్డుకోవడం వంటి ఫిర్యాదులు పెద్ద ఎత్తున అందుతున్నాయి. అసిన్సోల్ దక్షిణ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థిని అగ్నిమిత్ర పాల్ కారుపై కూడా రాళ్ల దాడి జరగడం పోలింగ్ రోజున నెలకొన్న ఉద్రిక్తతకు నిదర్శనంగా నిలిచింది.
ఈ ఆరోపణలను తృణమూల్ కాంగ్రెస్ నాయకత్వం కొట్టిపారేసింది. బీజేపీ అభ్యర్థులు సానుభూతి కోసమే ఇలాంటి డ్రామాలు ఆడుతున్నారని, ప్రజలు శాంతియుతంగా ఓటు వేస్తున్నారని పేర్కొంది. ఎన్నికల సంఘం ఈ ఘటనలపై స్పందిస్తూ వివరణ కోరినట్లు సమాచారం. ఈ గొడవలు జరిగినప్పటికీ, దక్షిణ దినాజ్‌పూర్ జిల్లాలో మధ్యాహ్నం 3 గంటల సమయానికే 81% పైగా పోలింగ్ నమోదు అయింది.
