Bihar MP Pappu Yadav  arrested in 31 year old forgery case: బీహార్ లోని పూర్ణియా స్వతంత్ర ఎంపీ  పప్పు యాదవ్ అలియాస్ రాజేష్ రంజన్)ను పాట్నా పోలీసులు శుక్రవారం అర్ధరాత్రి హైడ్రామా మధ్య అరెస్ట్ చేశారు. సుమారు 31 ఏళ్ల క్రితం  1995లో నమోదైన ఫోర్జరీ , మోసం కేసుకు సంబంధించి కోర్టు జారీ చేసిన వారెంట్‌ను అమలు చేస్తూ పోలీసులు  అరెస్టు చేశారు.  పార్లమెంట్ సమావేశాలకు హాజరై ఢిల్లీ నుంచి తిరిగి వచ్చిన గంట వ్యవధిలోనే పోలీసులు ఆయన నివాసాన్ని ముట్టడించి అదుపులోకి తీసుకున్నారు.  

31 ఏళ్ల నాటి ఫోర్జరీ కేసు 

1995లో పాట్నాలోని గర్దనీబాగ్ పోలీస్ స్టేషన్‌లో నమోదైంది. వినోద్ బిహారీ లాల్ అనే వ్యక్తి ఫిర్యాదు మేరకు, పప్పు యాదవ్ తన ఆస్తిని తప్పుడు పత్రాలతో అద్దెకు తీసుకున్నారని, నివాస అవసరాలకని చెప్పి దానిని తన రాజకీయ కార్యాలయంగా వాడుకున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో ఆయన సుదీర్ఘకాలంగా కోర్టు విచారణకు హాజరుకాకపోవడంతో,  ప్రజాప్రతినిధుల కోర్టు ఇటీవల అరెస్ట్ వారెంట్ జారీ చేసింది.

 అర్ధరాత్రి హైడ్రామా 

శుక్రవారం రాత్రి సుమారు 10:30 గంటల సమయంలో 50 మందికి పైగా పోలీసులు పాట్నాలోని మందిరి ప్రాంతంలో ఉన్న పప్పు యాదవ్ నివాసానికి చేరుకున్నారు. ఆ సమయంలో ఆయన మద్దతుదారులు పెద్ద ఎత్తున అక్కడకు చేరుకుని పోలీసులను అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు తనను అరెస్ట్ చేసే అధికారం లేదని, కేవలం ఆస్తుల జప్తు వారెంట్ మాత్రమే ఉందని పప్పు యాదవ్ వాదించారు. చివరకు సుమారు రెండు గంటల వాదోపవాదాల తర్వాత, అర్ధరాత్రి 12:15 గంటల సమయంలో పోలీసులు ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు.

 రాజకీయ కక్షసాధింపు అని ఆరోపణ 

తన అరెస్టును పప్పు యాదవ్ తీవ్రంగా ఖండించారు. తాను శనివారం ఉదయం 11 గంటలకు స్వచ్ఛందంగా కోర్టులో హాజరుకావాలని నిర్ణయించుకున్నానని, కేవలం తన గొంతు నొక్కడానికే ప్రభుత్వం ఈ విధంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. రాష్ట్రంలోని నీట్ అభ్యర్థుల మరణాలు, ఇతర ప్రజా సమస్యలపై తాను ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నందుకే, పాత కేసులను సాకుగా చూపి వేధిస్తున్నారని ఆయన పేర్కొన్నారు.

 ఆస్పత్రిలో చేరిక 

అరెస్ట్ అనంతరం పప్పు యాదవ్ ఆరోగ్యం క్షీణించింది. తీవ్రమైన తలనొప్పి, రక్తపోటు పెరగడంతో శనివారం ఉదయం ఆయన్ని పాట్నా మెడికల్ కాలేజ్ హాస్పిటల్ కు తరలించారు. ప్రస్తుతం ఆయన వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు. వైద్య పరీక్షలు పూర్తయిన తర్వాత పోలీసులు ఆయన్ని కోర్టులో హాజరుపరచనున్నారు. ఈ అరెస్టును కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సహా పలువురు విపక్ష నేతలు ఖండించారు.  

ఒకప్పుడు లాలూ యాదవ్‌కు రైట్ హ్యాండ్

పప్పు యాదవ్ తన రాజకీయ జీవితం ప్రారంభంలో లాలూ ప్రసాద్ యాదవ్‌ను తన రాజకీయ గురువుగా భావించేవారు. 1990లో లాలూ యాదవ్ ముఖ్యమంత్రి కావడంలో పప్పు యాదవ్ కీలక పాత్ర పోషించారు.  ఒకానొక సమయంలో లాలూ యాదవ్ తన రాజకీయ వారసుడిగా పప్పు యాదవ్‌ను ప్రకటిస్తారని ప్రచారం జరిగింది. కానీ, లాలూ తన కుమారులైన తేజస్వీ యాదవ్, తేజ్ ప్రతాప్ యాదవ్‌లను రాజకీయాల్లోకి తీసుకురావడంతో వీరి మధ్య దూరం పెరిగింది. 2015లో లాలూ యాదవ్ తన కుమారుడిని వారసుడిగా ప్రకటించడాన్ని పప్పు యాదవ్ వ్యతిరేకించడంతో, ఆయన్ని పార్టీ  నుండి బహిష్కరించారు. అయితే ఆయన స్వతంత్రంగా గెలుస్తూ వస్తున్నారు.