Bihar CM Nitish Kumar:


RSS,మోడీపై నితీష్ సెటైర్లు


స్వాతంత్య్రోద్యమంలో RSS పోరాటం చేయలేదని, దేశానికి స్వతంత్రం లభించడంలో ఆ సంస్థ చేసిన కృషి ఏమీ లేదని బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ విమర్శించారు. "స్వాతంత్య్రోద్యమంలో వాళ్లు చేసిందేమీ లేదు. ఎప్పుడూ ఈ పోరాటంలో పాలు పంచుకోలేదు" అని అన్నారు. అంతే కాదు. ప్రధాని నరేంద్ర మోడీపైనా విమర్శలు చేశారు. "నవ భారత జాతి పిత" దేశానికి చేసిందేమీ లేదంటూ సెటైర్ వేశారు. "ఈ మధ్య కాలంలో నవ భారత జాతిపిత అని ఆయనను అందరూ పిలుస్తున్నారు. ఈ న్యూ ఫాదర్...న్యూ ఇండియాకు చేసిందేమీ  లేదు" అని అన్నారు. ఇటీవల మహారాష్ట్ర డిప్యుటీ సీఎం దేవేంద్ర ఫడణవీస్ సతీమణి అమృత ఫడణవీస్ ప్రధాని మోడీని ఫాదర్ ఆఫ్ నేషన్ అంటూ పొగిడారు. దీనిపై ప్రతిపక్షాలు భగ్గుమన్నాయి. ఇప్పుడు నితీష్ కుమార్ సెటైర్ వేసింది కూడా ఈ కామెంట్స్‌పైనే. నితీష్ మాత్రమే కాదు. అటు కాంగ్రెస్ కూడా ఆమెపై తీవ్రంగానే విమర్శలు చేసింది. ప్రధాని మోడీని గాంధీతో పోల్చడం ఏంటని మండి పడింది. "జాతిపిత మహాత్మా గాంధీని ఎవరితోనూ పోల్చలేం. బీజేపీ చెబుతున్న నవ భారతం..కేవలం ధనికులకు మాత్రమే. మిగతా వాళ్లు ఆకలితో అలమటిస్తూనే ఉన్నారు. ఇలాంటి కొత్త భారత్ మనకు వద్దు. బడా బిజినెస్‌మేన్‌లున్న నవ భారత్‌కు మోడీని జాతిపిత చేసుకోవాలనుకుంటే చేసుకోండి. మేం అభినందనలు కూడా చెబుతాం" అని మహారాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు నానా పటోలే విమర్శించారు. 






నవ జాతిపిత..


మహారాష్ట్ర డిప్యుటీ సీఎం దేవేంద్ర ఫడణవీస్ సతీమణి అమృత  ఫడణవీస్...ప్రధాని మోడీని ఉద్దేశిస్తూ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. నవ భారతానికి ప్రధాని మోడీ జాతిపిత అని ఆమె ఓ కార్యక్రమంలో కామెంట్ చేశారు. నాగ్‌పూర్‌లో Abhirup Court పేరిట జరిగిన ఓ కార్యక్రమం జరిగింది. మహాత్మా గాంధీ గురించి ప్రస్తావన రాగా...అమృత ఇలా స్పందించారు. "భారత్‌కు ఇద్దరు జాతిపితలు ఉన్నారు. ఒకప్పుడు మహాత్మా గాంధీ. ఇప్పటి నవ భారతానికి ప్రధాని నరేంద్ర మోడీ" అని అన్నారు. ఇప్పుడే కాదు. గతంలోనూ ఓ సందర్భంలో అమృత ఫడణవీస్ ఇదే వ్యాఖ్యలు చేశారు. మోడీని గాంధీతో పోల్చారు. అప్పట్లోనూ రాజకీయ పరంగా ఈ వ్యాఖ్యలు పెద్ద దుమారమే రేపాయి. ఇప్పుడు కూడా మళ్లీ అవే వ్యాఖ్యలు చేసి రాజకీయాల్ని మరోసారి వేడెక్కించారు. ఇక ఈ వ్యాఖ్యలపై విమర్శలు వస్తాయని, వాటిని పట్టించుకోననీ అన్నారు. "నేనెప్పుడూ రాజకీయాల గురించి మాట్లాడలేదు. అలాంటి వ్యాఖ్యలూ చేయలేదు. వాటిపై నాకు పెద్దగా ఆసక్తి కూడా లేదు. సాధారణ ప్రజలెవరూ నన్ను ట్రోల్ చేయరు. కేవలం శివసేన, ఎన్‌సీపీ ఇలాంటి పనులు చేస్తూ ఉంటుంది. వాళ్లకు అంత ప్రాధాన్యత ఇవ్వడం అనవసరం. నేను భయపడేది కేవలం మా అమ్మకు, అత్తమ్మకు అంతే. మిగతా ఎవరినీ లెక్క చేయను" అని స్పష్టం చేశారు. 


Also Read: New Year 2023: కొత్త ఏడాదిలో సక్సెస్, సంతోషం మీ వెన్నంటే ఉండాలి - ప్రధాని న్యూ ఇయర్ విషెస్