Begusarai Bridge Collapse:


బేగుసరైలో కూలిన బ్రిడ్జ్..
 
బిహార్‌లోని బేగుసరైలో నిర్మాణంలో ఉన్న వంతెన కూలిపోయింది. బుర్హీ గందక్ నదిపై నిర్మించిన బ్రిడ్జ్‌ ఉన్నట్టుంది కుప్ప కూలింది. ఈ ప్రమాదం జరిగిన సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడం వల్ల ప్రాణనష్టం సంభవించలేదు. ఆదివారం సాయంత్రం ఈ ఘటన జరిగినట్టు అధికారులు వెల్లడించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తాత్కాలికంగా వంతెనను మూసివేశామని బేగుసరై జిల్లా మెజిస్ట్రేట్ తెలిపారు. రెండు పిల్లర్ల మధ్య పగుళ్లు రావడం వల్ల కూలిపోయినట్టు తేలింది. "బేగుసరైలోని బుర్హీ గందక్ నదిపై నిర్మించిన వంతెన కూలిపోయింది. అంతకు ముందే వంతెనపై చాలా చోట్ల పగుళ్లు వచ్చాయి. తాత్కాలికంగా ఈ బ్రిడ్జ్‌ను మూసివేశాం. ఎందుకు కూలిపోయిందో విచారణ చేపడుతున్నాం" అని మెజిస్ట్రేట్ స్పష్టం చేశారు. 206 మీటర్ల పొడవైన వంతెనను మా భగవతి కన్‌స్ట్రక్షన్ సంస్థ నిర్మించింది. ముఖ్యమంత్రి నాబార్డ్ పథకం కింద ఈ నిర్మాణం చేపడుతున్నారు. ఇందుకోసం రూ.13 కోట్లు కేటాయించినట్టు తెలుస్తోంది. 2016 ఫిబ్రవరిలోనే ఈ నిర్మాణాన్ని మొదలు పెట్టారు. 2017లో పూర్తి చేశారు.  అయితే...అప్రోచ్ రోడ్‌ లేని కారణంగా బ్రిడ్జ్‌ను ప్రారంభించలేదు. అప్పటి నుంచి కేవలం లైట్ వెహికిల్స్‌ను మాత్రమే దీనిపై అనుమతిస్తున్నారు. అయితే...ఈ మధ్యే రెండు, మూడు పిల్లర్లపై పగుళ్లు వచ్చాయి. ఫలితంగా...వాహనాల రాకపోకల్ని పూర్తిగా నిలిపివేశారు. "బ్రిడ్జ్‌ను అధికారికంగా ప్రారంభించకపోయినా...చిన్నపాటి వాహనాలను అనుమతించాం. ఈ వంతెన మూడు పంచాయతీలను కలుపుతోంది" అని అధికారులు చెప్పారు.